తెలంగాణ

telangana

ETV Bharat / state

High Court: ఆక్రమణల తొలగింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

నిర్మల్ పట్టణంలోని చెరువుల్లో ఆక్రమణల తొలగింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల్లో కబ్జాలన్నీ తొలగించడంతో పాటు.. మళ్లీ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశించింది.

High Court: ఆక్రమణల తొలగింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం
High Court: ఆక్రమణల తొలగింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

By

Published : Jun 4, 2021, 7:46 PM IST

నిర్మల్​లో చెరువుల ఆక్రమణలపై గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. నిర్మల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించి.. ఆరు నెలలైనా ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్మల్ లో 11 చెరువులుండగా.. ఆరింటిలో అక్రమణలు గుర్తించామని.. వాటిలో సుమారు 80 శాతం తొలగించినట్లు కలెక్టర్ వివరించారు.

కరోనా తీవ్రత, భైంసా అల్లర్లు, సిబ్బంది కొరత కారణంగా కొంత ఆలస్యమైందని.. నెల రోజుల్లో మిగతా ఆక్రమణలు పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. చెరువుల చుట్టూ కంచె ఏర్పాటు పనులు 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. పట్టణంలోని వరద కాలువల ఆక్రమణలను ఆరు వారాల్లో తొలగించి.. వాటిని చెరువులకు కలపాలని ఆదేశించింది. ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి స్థాయి బ్లూప్రింట్​ను సమర్పించాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 29కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:MLC Palla: అందరిలా.. ఈటల కూడా అదే పాటించారు

ABOUT THE AUTHOR

...view details