ఉపాధి కోసం సింగపూర్ వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం ఎలగడపకు చెందిన యువకుడు భుక్యా తిరుపతినాయక్ ఈ నెల 23న అక్కడే కరోన బారినపడి మరణించారు. కొవిడ్ లక్షణాలతో మరణించడం వల్ల సింగపూర్ ప్రభుత్వం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి పంపించకుండా బుధవారం రాత్రి అక్కడే ఖననం చేయించింది. కడసారి చూపునకు నోచుకోలేకపోయామని భార్య, తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. సింగపూర్‌లో హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిన విషయం చరవాణుల్లో చూసుకున్న కుటుంబసభ్యులు గురువారం ఇంటివద్ద శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహించారు.
అంత్యక్రియలక్కడ.. నివాళులిక్కడ
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయపూర్‌కాండ్లి వాసి ఈశ్వర్ దేవేందర్ మూడు రోజుల కిందట దుబాయ్‌లో మరణించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. అప్పటి నుంచి ఆ కుటుంబం నిద్రాహారాలు మాని రోదిస్తోంది. మూడేళ్ల కిందట రూ.1.50 లక్షలు అప్పు చేసి గల్ఫ్ బాట పట్టగా రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చారు. ఇక్కడ ఉపాధి లేక 9 నెలల కిందట మళ్లీ ఎడారి దేశానికే వెళ్లాడు. అక్కడ ఏమైందో.. ఎలా జరిగిందో తెలియదు కానీ దేవేందర్ మరణించినట్లు కబురందింది.
ఉమ్మడి జిల్లాకు చెందిన 25 వేల మందికి పైగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. దుబాయ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, రియాద్, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వాతావరణం పడక అనారోగ్యంతో, భవన నిర్మాణాల్లో ప్రమాదాలతో, రోడ్డు ప్రమాదాల్లో విగత జీవులవుతున్నారు. అనుకున్న వేతనం రాక, అప్పులు తీరక ఒత్తిడితో గుండెపోటుకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో పరిశీలిస్తే ప్రతి నెలా ఒకరిద్దరి శవాలు స్వగ్రామాలకు వస్తున్నాయి.