Governor Tamilisai: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు బాసర ఆర్జీయూకేటీలో పర్యటించనున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్.. ఇప్పటికే బాసర చేరుకున్నారు. తొలుత బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు ఆలయ అర్ఛకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం గవర్నర్ ఆర్జీయూకేటీకి వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి.. వారితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. విద్యార్థులు, బోధకులతో, సిబ్బందితో మాట్లాడి సమస్యలపై ఆరా తీయనున్నారు.
గవర్నర్ పర్యటనకు ఇదీ కారణం..: ఇటీవల ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కలుషిత ఆహారం ఘటనకు సంబంధించిన బాధ్యులపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఆర్జీయూకేటీలోని మెస్‌లు ఇ1, ఇ2 ముందు విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. రాత్రి భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళనకు దిగారు.