GCC Giri brand soap: శరీరానికి పట్టిన మలినాలను తొలగించుకోవాలంటే కావాల్సింది సబ్బు. టీఎఫ్ఎం శాతం ఎక్కువగా ఉండే వాటికే.. ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. నేడు అలాంటి వాటి కోసం వెతకాల్సిన అవసరం లేకుండా చేసింది.. గిరిజన సహకార సంస్థ. అదెక్కడో కాదు నిర్మల్‌లోని జీసీసీకి చేదోడువాదోడుగా ఉండేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ఏర్పాటు చేసిన సబ్బుల పరిశ్రమ సత్ఫలితాలను ఇస్తోంది. ఆయుష్ డిపార్టుమెంటు ఫార్ములాతో.. గిరిజన సహకార సంస్థచే నడుస్తున్న ఈ పరిశ్రమలో తయారవుతున్న సబ్బులు చాలా నాణ్యత కలిగి ఉంటాయి. తయారీకి ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సహజ సిద్ధ ఔషధాలను మాత్రమే వాడుతున్నారు. ఈ సబ్బులను వేప, తులసి, కలబంద అనే మూడు రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ఒక్కొక్కటి 150 గ్రాముల పరిమాణంలో ఉంటాయి.
ఆన్‌లైన్‌లో అటవీ ఉత్పత్తులు
ఆన్‌లైన్‌లో అటవీ ఉత్పత్తులను ఆదివాసీలు అమ్ముతున్నారు. ఈ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గిరిజన సహకార సంస్థ కార్పొరేట్ వ్యాపార విధానాన్ని అవలంబిస్తూ.. గిరి బ్రాండ్‌కు డిమాండ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న.. తేనె, శానిటైజర్ లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది.
ఈ ఫ్యాక్టరీకి రోజూ పది వేల సబ్బులను తయారు చేసే కెపాసిటీ కలిగిఉంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు, సరిహద్దుల్లోని వారికి కూడా ఇక్కడి నుంచి సబ్బులను పంపడం జరుగుతోంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇక్కడే తయారు చేస్తున్నాం. ఇవి చాలా నాణ్యమైనవి. హెర్బల్ ఇంగ్రిడియెంట్స్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పటివరకు మూడు కోట్ల వ్యాపారం చేశాం.
-విజయ కుమార్, జీసీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ మేనేజర్