ఒకప్పుడు అది బంజరుభూమి. కానీ ఇప్పుడు.. పుడమి తల్లి పచ్చనిచీర కట్టుకున్నట్లు.. ఎటు చూసినా పచ్చదనమే. ఆ ప్రాంతంలో అడుగు పెడితే చాలు.. చెట్లు రారమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది.
లక్ష మొక్కలు..
బంజరుభూమిగా మారిన ఆ ప్రాంతం.. ఇప్పుడు పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను పులకరించడానికి కారణం అటవీ శాఖ. దేవునిగూడెం ప్రాంతం ఒకప్పుడది అడవే. ఆక్రమణలపాలై ఆనవాళ్లు కోల్పోయి బంజరుభూమైంది. ఆక్రమణకు గురైన 160 ఎకరాల భూమిని పోలీసుశాఖ, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. మొదటి విడత హరితహారంలో భాగంగా అక్కడ ‘ఒక రోజు లక్ష మొక్కల’ కార్యక్రమం చేపట్టారు. 2015 జులై 7న చేపట్టిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ఓ మొక్క నాటారు. మొక్కల్ని పెంచే పనుల్లో గ్రామస్థులను భాగస్వామ్యం చేశారు. దీంతో ఇప్పుడు అక్కడ సహజసిద్ధ అడవి రూపుదిద్దుకుంది.
పచ్చదనంలో అగ్రగామి..
హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ డివిజన్ దేవునిగూడెంలో 160 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ అడవి.. ఐరాస పర్యావరణ విభాగం ప్రశంసలు అందుకుంది. ‘పచ్చదనం పెంచడంలో భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ప్రపంచ అగ్రగామి (లీడర్)గా ఉంది. ఆక్రమణలకు గురైన 160 ఎకరాల భూమిని కృషితో దట్టమైన అడవిగా అభివృద్ధి చేసిన ఖానాపూర్ అటవీ అధికారుల బృందానికి అభినందనలు’ అంటూ ఐరాస పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఎరిక్ సొల్‌హెమ్ ట్వీట్ చేశారు.