ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో 892 చ.కి.మీ. కోర్ ప్రాంతంగా, 1,123 చ.కి.మీ. బఫర్ ప్రాంతంగా అధికారులు గుర్తించారు. 16 మండలాల్లోని అటవీ ప్రాంతం ఈ కేంద్రంలోకి వస్తుంది. అటవీ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ గట్టిగా చర్యలు చేపట్టాల్సి ఉండగా కార్యాచరణ అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు విలువైన కలపను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. వీరికి అటవీశాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమాయకులకు ఆశలు కల్పించి..
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న విలువైన కలప సంపదపై అక్రమార్కులు కన్నేశారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఎత్తుగడలతో అక్రమాలకు పాల్పడడంలో దిట్టలుగా నిలుస్తున్న కలప స్మగ్లర్లు అటవీ హక్కు చట్టం చాటున అమాయకులను మభ్యపెడుతున్నారు. మీరు చెట్లు కొట్టుకోండి! మీ కష్టానికి మేము కూలీ చెల్లిస్తాం. కలప మేం తీసుకుంటాం. వ్యవసాయం చేసుకోవడానికి మీకు భూమి దక్కుతుంది. దాన్ని మీరు దున్నుకోండని నమ్మిస్తున్నారు. ఇస్లాంపూర్, పాండ్వాపూర్, బిర్సాయిపేట, బలాన్‌పూర్ అటవీ ప్రాంతాల్లోని విలువైన వనాలను నరికి వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కలపను తరలించుకుంటూ.. సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పట్టుబడినా అక్రమ వ్యాపారాన్ని మాత్రం కొనసాగించడం గమన్హారం.
అటవీ హక్కు చట్టం సాకుతో...