కాకరకాయ రుచికి భిన్నంగా ఉండే బోడ కాకరకాయ అంటే ఇష్టపడని వారుండరు. కానీ ధర చెప్పగానే మాత్రం కొంచెం వెనక్కి తగ్గుతారు. అధిక ధరలు ఎందుకంటే.. మిగతా కూరగాయల్లా ఈ కాకరకాయలు అన్ని కాలాల్లో దొరకకపోవడమే!! మంచి రుచి.. ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే బోడ(అడవి) కాకరకాయని అన్ని కాలాల్లోనూ పండించాలనే లక్ష్యంతో వినూత్న ప్రయోగం చేపట్టారు నిర్మల్‌కి చెందిన విశ్రాంత ఉద్యోగి సంపత్ కుమార్. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. దిలావర్పూర్ మండలం కాల్వ సమీపంలోని వ్యవసాయక్షేత్రంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
తక్కువగా మొలకెత్తిన ఆడజాతి విత్తనాలు
అడవి కాకర సాగు ఆలోచన వచ్చాక విత్తనాల కోసం సంపత్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాకర తీగ అడవి జాతి కావడంతో ప్రత్యేకంగా అటవీ ప్రాంతంలో సేకరిస్తే తప్ప విత్తనాలు లభించవు. ఈ ప్రయత్నంలో కరీంనగర్‌కు చెందిన తన మిత్రుడి సహకారంతో అరకిలో విత్తనాలు సేకరించారు. తర్వాత వ్యవసాయ క్షేత్రంలో 48 పొరకలను నాటి వాటికి బోడ కాకరకాయ విత్తనాలు విత్తారు. మొలకెత్తినప్పటి నుంచి కంటికి రెప్పలా వాటిని కాపాడారు. నాటిన వాటిలో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే మొలకెత్తుతాయని.. అందులో మగ జాతి మొక్కల సంఖ్యే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని జిల్లా ఉద్యాన అధికారుల ద్వారా సంపత్ కుమార్ తెలుసుకున్నారు. కానీ నాటిన వాటిలో కేవలం 6 శాతం మాత్రమే మొలకెత్తగా ఆడ జాతి కన్నా మగ జాతివి ఎక్కువ మొలకెత్తాయి. దీంతో కాయల సంఖ్య తక్కువ వచ్చింది.
అయినా నిరుత్సాహపడకుండా నిత్యం వాటి పర్యవేక్షణలో ఉంటూ సాగు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఆయన తోటలో ఇప్పుడు 85 బోడ కాకరకాయ మొక్కలు ఉన్నాయి. వాటిలో ఆడ జాతి కాకర తీగలు కాయ కాయడం ప్రారంభించాయి.