Kadem Project inflow : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు ఉండగా... ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి వరదనీరు వస్తోంది. 5లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 1995 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద రావడంతో మొదట ఆందోళన చెందిన అధికారులు.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్ రూమ్‌లోకి వరదనీరు చేరింది. భారీగా వరద చేరుతుండడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరివాహక ప్రాంత 15 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోపక్క.. కడెం ప్రాజెక్టును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. ఖానాపూర్ ఆర్ అండ్ బూ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్టులో వరద పరిస్థితిపై ఆరా తీశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌కు మంత్రి వివరించారు. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.