‘కొవిడ్ పాజిటివ్ అని తెలిసి.. అసలు మా ఆస్పత్రిలో డెలివరీలే చేయట్లేదని పంపించేశారం’టోంది వైరస్ బారిన పడిన ఓ నిండు గర్భిణి.‘దగ్గు, జలుబు ఉన్నాయి.. కొవిడ్ టెస్ట్ చేయమని వెళ్తే.. అందుకు రావాల్సింది ఇక్కడికి కాదు.. కొవిడ్ సెంటర్స్‌కి వెళ్లండి’ అన్నారని తాను తరచూ వెళ్లే ఆస్పత్రి నిర్లక్ష్యం గురించి చెబుతోంది మరో గర్భిణి.
ఏడాది క్రితం కొవిడ్ అంటే ఒక స్పష్టమైన అవగాహన లేదు.. దాంతో వైరస్ ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న ఒక భయం చాలామందిలో ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ ఈ వైరస్ గురించి పూర్తిగా అవగాహన వచ్చింది. దాని బారిన పడకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికెళ్తే ఎలా మసలుకోవాలి.. ఇవన్నీ దాదాపు అందరూ పాటిస్తున్నారు. అయితే ఈ రెండో దశలో యువత ఎక్కువగా వైరస్ బారిన పడడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం వైరస్ సోకిన గర్భిణులు చాలా తక్కువ శాతమే అని చెప్పాలి. ఇందుకు వారు ముందు నుంచీ కనీస జాగ్రత్తలు పాటించడం.. సరైన పోషకాహారం తీసుకోవడం/వ్యాయామాలు చేయడం.. వంటివీ కారణాలు కావచ్చు. ఒకవేళ వారికి వైరస్ సోకినా దాని వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు సైతం తక్కువగానే ఉంటున్నాయి. మా దగ్గరికొచ్చే కొవిడ్ గర్భిణుల్లో కూడా జలుబు, దగ్గు, జ్వరం.. వంటి అతి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి.
సహజ ప్రసవాల వైపే మొగ్గు!
సాధారణంగా మా వద్దకొచ్చే గర్భిణులు సహజ ప్రసవాల వైపే మొగ్గు చూపుతారు. అందుకు తగ్గట్లుగానే ముందు నుంచీ శారీరకంగా, మానసికంగా సిద్ధపడతారు. మేము కూడా వారిని ఆ దిశగానే సన్నద్ధం చేస్తుంటాం. అయితే ప్రస్తుతం కరోనా సోకిన గర్భిణులలో కొంతమంది కొవిడ్ ఉంది కదా నార్మల్ అవుతుందా అన్న సందేహం, భయం వ్యక్తం చేస్తుంటారు. ముందుగా మేము వారిలో ఉన్న ఆ భయాన్ని దూరం చేస్తాం. నిజానికి కొవిడ్ ఉన్నా, సాధారణ డెలివరీ విషయంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. సాధారణ గర్భిణులకు కాన్పుకు ముందు ఎలాగైతే బీపీ, షుగర్, రక్త పరీక్ష.. వంటివి చేస్తామో.. వీరికీ అవే పరీక్షలు చేస్తాం. ఆక్సిజన్ శ్యాచురేషన్ చెక్ చేస్తాం. వారి ఆక్సిజన్ స్థాయులు సాధారణంగా ఉంటే ఇక ఏ భయం అక్కర్లేదు. ఇలా ఇప్పటివరకు మా ఆస్పత్రిలో సుమారు 12 మంది కొవిడ్ గర్భిణులకు సహజ కాన్పులు చేశాం. ఒక సిజేరియన్ కాన్పు జరిగింది. ఇక ప్రసవాలు చేసే విషయంలో కొవిడ్‌కు ముందు, ఇప్పుడు పెద్దగా తేడాలేమీ లేవు కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డెలివరీలు చేసే సమయంలో పీపీఈ కిట్ ధరించడం అదనంగా వచ్చి చేరింది. ఇది కాస్త అసౌకర్యంగానే ఉంటోంది.. అయినా తప్పట్లేదు.
తల్లి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మా ఆస్పత్రిలో ప్రసవించిన కొవిడ్ గర్భిణులందరికీ దాదాపు ఐదారు రోజుల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపిస్తున్నాం. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. అయినా సరే.. వారు మరో రెండు వారాల పాటు కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే! ఈ క్రమంలోనే వారు డిశ్చార్జి అయ్యేటప్పుడే వారికి కొన్ని సూచనలు చెబుతాం. అవేంటంటే..!
- తల్లికి నెగెటివ్ వచ్చినా తల్లీబిడ్డలిద్దరూ ఓ వారం పాటు హోమ్ ఐసొలేషన్‌లో ఉండాలి.
- తల్లి తనకు తాను జాగ్రత్తపడుతూనే.. మాస్క్ ధరించడం, ఎప్పటిప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవడం, మాస్క్ పెట్టుకునే పాపాయికి పాలు పట్టడం.. వంటివి చేయాల్సి ఉంటుంది.
- చాలామంది తల్లులు తమకు కరోనా ఉంది.. పాలిస్తే పాపాయికి వస్తుందేమోనన్న భయంతో ఫీడింగ్ ఇవ్వడం మానేస్తుంటారు. అది ఎంతమాత్రమూ కరక్ట్ కాదు. ఎందుకంటే తల్లి పాలలో వైరస్ ఉండదని, తద్వారా బిడ్డకు సోకే అవకాశమే లేదని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిపాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్స్, యాంటీబాడీస్.. వంటివి ఉంటాయి. ఇవి పుట్టిన పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. అందుకే హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నా తల్లి బిడ్డకు పాలు పట్టాల్సిందే!
- ఇక కొవిడ్ సోకిన గర్భిణులు డెలివరీ తర్వాత ప్రత్యేకమైన పథ్యాలు చేయాల్సిన పని లేదు. ఏది తిన్నా అందులో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు.. డ్రైఫ్రూట్స్, పండ్ల రసాలు, ఉడికించిన కోడిగుడ్డు.. వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇటు కొవిడ్ నుంచి క్రమంగా కోలుకోవచ్చు.. ప్రసవానంతర సమస్యల్నీ అధిగమించచ్చు.
కొవిడ్ కంటే ముందు భయాన్ని జయించాలి!
ప్రస్తుతం నెలలు నిండిన వారే కాదు.. తొలి త్రైమాసికం, రెండో త్రైమాసికంలో ఉన్న వారు సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. అలాంటి వారిలోనూ ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు, అలసట, నీరసం.. వంటి చిన్నపాటి లక్షణాలే ఉంటున్నాయి. అంతమాత్రాన కడుపులోని బిడ్డకు ఏదో అయిపోతుందన్న టెన్షన్ అవసరం లేదు. ఈ క్రమంలో సాధారణంగా అందరికీ సూచించే చికిత్సనే వీరికీ సూచిస్తాం. దీనివల్ల కడుపులోని బిడ్డకు ఎలాంటి సమస్యలూ తలెత్తవు కూడా!
- ముఖ్యంగా కుటుంబ సభ్యులకు దూరంగా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ నిరంతరం మాస్క్ పెట్టుకోవాలి.. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి.
- ఆక్సిజన్ స్థాయులు, శరీర ఉష్ణోగ్రత ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం.
- ఇలా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ మీ ఆరోగ్య స్థితిని బట్టి మీ గైనకాలజిస్ట్ సలహా మేరకు సంబంధిత మందులు వాడినా దాని ప్రభావం కడుపులోని బిడ్డపై ఏమీ ఉండదు. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.
- అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా, ఒకవేళ వెళ్లినా మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం.. వంటివి చేయాలి.
- పండ్ల రసాలు, నీళ్లు, పౌష్టికాహారం నిర్ణీత వేళల్లో తీసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో ఉదయం పూట - ఉడికించిన కోడిగుడ్డు, భోజనంలో - ఆకుకూరలు, మాంసం, సాయంత్రం స్నాక్స్ సమయంలో - డ్రైఫ్రూట్స్, సీజనల్ పండ్లు.. అన్నీ తీసుకోవచ్చు. అసలే గర్భిణులం.. కొవిడ్ బాధితులం అంటూ ఎలాంటి పథ్యాలు చేయాల్సిన పని లేదు.
- రోజులో రెండు మూడుసార్లు ఆవిరి పట్టుకోవచ్చు. ఇది ఒక శ్వాస సంబంధిత వ్యాయామంలా పని చేస్తుంది.
- ఐసొలేషన్‌లో ఉన్నాం కదా అని అదే గదికి పరిమితం కాకుండా.. మీ కుటుంబ సభ్యులకు దూరంగా అలా ఇంటి ముందు నడవడం, యోగా చేయడం.. వంటివి సత్ఫలితాలనిస్తాయి.
అప్పుడు పీపీఈ కిట్స్ కూడా లేవు!
"ఇప్పుడంటే కరోనా గురించి అందరిలో అవగాహన ఉంది.. వైరస్‌ను ఎదుర్కోవడానికి వైద్య సదుపాయాలు కొంతవరకు అందుబాటులో ఉంటున్నాయి. అదే తొలినాళ్లలో అయితే కొవిడ్ బాధితులకు చికిత్స చేసే క్రమంలో కనీసం పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉండేవి కావు. ఏడాది క్రితం మా ఆస్పత్రిలో కూడా మేము పీపీఈ కిట్లు ధరించకుండానే ప్రసవాలు చేసేవాళ్లం. అప్పట్లో కాస్త బెరుకుగానే అనిపించేది. ఎందుకంటే నాకు మూడేళ్ల పాప ఉంది. మా అత్తయ్య, మామయ్య కూడా పెద్ద వాళ్లు కావడంతో వారి ఆరోగ్య రీత్యా మొదట్లో నేను వాళ్లకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. అటు ఆస్పత్రిలో, ఇటు ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నాలో ఈ బెరుకు పోవడానికి మా వారు కూడా ఓ కారణమే! తను వృత్తిరీత్యా పిడియాట్రీషియన్. కొవిడ్ గర్భిణుల కేసుల విషయంలో తను నన్ను ప్రోత్సహించేవారు. ఇక ఇప్పుడైతే మా దగ్గరికొచ్చే ప్రతి కేసూ (కొవిడ్ ఉన్నా, లేకపోయినా) కొవిడ్ ఉందేమో అన్నట్లుగానే ట్రీట్ చేస్తున్నాం. తద్వారా వారి విషయంలో, మా పరంగా మరింత జాగ్రత్తగా ఉండచ్చన్నదే దీని వెనకున్న ముఖ్యోద్దేశం."- డాక్టర్ వనిత