నిర్మల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముధోల్ నియోజకవర్గంలో గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు,వాగులు, చెరువులు నిండి మత్తడి పడుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు 13వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గడ్డేన వాగు ప్రాజెక్టులోకి వరద ఎక్కవ కావటంతో కొన్ని వేల క్యూసెక్కుల నీటిని సుద్దవాగులోకి వదిలారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
సుద్దవాగులో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో చుట్టుపక్కల పొలాలు నీట మునిగాయి. లోకేశ్వరం మండలంలో 2,863, తానూర్ మండలంలో 2,169, కుంటాల మండలంలో 1,237, కుబీర్ మండలంలో 721 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎక్కువగా సొయా, పత్తి పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.