నిర్మల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం వల్ల అధికార యంత్రాంగం శుక్రవారం నుంచి మంగళవారం వరకు అయిదు రోజుల పాటు ప్రత్యేక లాక్‌డౌన్ ప్రకటించింది. గురువారం ఒక్కరోజే ఐదు కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 20కి పెరిగింది. ఈ పరిస్థితితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో సాధారణ లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రత్యేక లాక్‌డౌన్‌లో అలాంటి సడలింపుపైనా నిషేధం విధించారు. అయిదు రోజుల పాటు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ప్రకటించారు. జిల్లాలో 11 కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించామన్నారు.
జిల్లా కేంద్రమైన నిర్మల్‌లోని జహురానగర్, గాజుల్‌పేట్, గుల్జార్‌మార్కెట్, మొగల్‌పుర, భైంసా పట్టణంలోని పురానా బజార్, పాండ్రిగల్లీ, నర్సాపూర్(జి) మండలం చాక్‌పెల్లి, లక్ష్మణచాంద మండలం కనకాపూర్, రాచాపూర్, మామడ మండలం న్యూలింగంపల్లి, పెంబి మండలం రాయదారి గ్రామాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాల నుంచి ప్రజలెవరూ బయటకు రాకుండా.. ఇతరులు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులే నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వస్తే కర్ఫ్యూ ఉల్లంఘనతో పాటు, అంటురోగాల వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేస్తారు. కేవలం మందులు, అత్యవసర వైద్యసేవలు అవసరమయ్యే వారికి మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. మందుల దుకాణం, ఆసుపత్రులు మినహా ఏవీ తెరిచి ఉంచరాదని చెప్పారు. వైరస్ లక్షణాలున్నాయని.. మందులివ్వాలని ఎవరైనా అడిగితే వారి చిరునామా, ఫోన్ నంబర్ కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని జిల్లాలోని అన్ని మందుల దుకాణాలను ఆదేశించారు. మరోవైపు ఇంటింటా వైద్య బృందాలతో సర్వే చేయిస్తున్నారు.
1430 మంది యువకులతో గల్లీవారియర్స్