ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు, సాధించిన పురోగతిపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆర్థిక పురోగతి సాధించేందుకు..
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నిలిచేందుకు, ఆర్థిక పురోగతి సాధించేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్లె ప్రగతిలో వివిధ నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, ఇకనుండి వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రతి గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరణ, వర్మి కంపోస్టు తయారీ తదితర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు.