నిర్మల్ జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా పథకంలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు.
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువతీ, యువకులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా యువజన, క్రీడా శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖేలో ఇండియా పథకంలో భాగంగా క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రతిపాదనలు సమర్పించడానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. పథకంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో చేపట్టే మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి రూ.10 కోట్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులతో ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.