నిర్మల్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పాలానాధికారి ముషర్రఫ్ ఫారూఖీ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఆస్తి పన్ను వసూలు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రగతి పనులపై పుర ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా నిర్వహించారు.
ఆ మూడు పురపాలికల్లో..
నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, పరిసర పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి నూతన మాస్టర్ ప్లాన్ కోసం అనుమతులు త్వరగా పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా వేర్వేరుగా సేకరించాలన్నారు.
నిరంతరం పర్యవేక్షించాలి..
పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పట్టణ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని, ప్రతి వార్డులో ట్రీ పార్క్, నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన వ్యాపార సముదాయాల్లో ప్రతి నెల అద్దె వసూలు చేయాలన్నారు.
ఆస్తి పన్ను వందశాతం వసూలు చేయండి : కలెక్టర్ ఫారూఖీ పర్మిషన్ లేకుంటే నిలిపివేతే..
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లే ఔట్లను, భవనాలను నిలిపివేయాలన్నారు. అనంతరం ఆర్థిక, అడిట్ అంశాలను పరిశీలించాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, బిల్ కలెక్టర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, జాబీర్ అమ్మద్, రాజేందర్, మున్సిపల్ కమిషనర్లు ఎంఏ ఖాదీర్, గంగాధర్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : టీచర్ల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది: బండి సంజయ్