నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జనం శోభా యాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరంలాగానే జిల్లా కేంద్రంలోని 1వ నంబర్ బుధవార్ పేట్ గణేశుని వద్ద పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రులు ఘనంగా జరిపించిన నిర్వాహకులు... నిమజ్జనానికి (Vinayaka immersion) ముందుకు రాలేదు.
Vinayaka immersion: నిర్మల్‌లో సాయంత్రం వరకు నిలిచిపోయిన నిమజ్జనం... ఎందుకంటే..! - నిర్మల్‌లో డీజేలకు అనుమతి నిరాకరణ
గణపతి నిమజ్జన శోభాయాత్రలో 'డీజే'ది (DJ) కీలకపాత్ర. మండపం నుంచి నిమజ్జనం చేసే వరకు దారి పొడవునా.. దూరం తెలియకుండా.. అడుగులను మెలికలు తిప్పుతూ సాగించేది డీజే అనడంలో సందేహం లేదు. అయితే శోభాయాత్రకు పోలీసులు డీజేకు అనుమతి నిరాకరించడం వల్ల.. ఏకంగా నిమజ్జనాన్నే నిలిపేశారు నిర్వాహకులు. సాయంత్రం 7.30 సమయంలో పోలీసులు అనుమతించడంతో శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది.
డీజేలకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల శోభాయాత్రను నిలిపేశారు. డీజేలకు అనుమతిస్తేనే విగ్రహాలను తరలిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ 48 గణేశ్ మండపాల నిర్వాహకులు ఒకటో నంబర్ వినాయకుని వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. అలాగే స్థానిక బాగులవాడ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసే స్వాగత వేదికను అడ్డుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్... సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నిర్వాహకులు అంగీకరించలేదు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర మధ్యాహ్నం 2 దాటినా ప్రారంభం కాలేదు. అటు పోలీసులు.. ఉత్సవ కమిటీలు తగ్గకపోవడంతో శోభాయాత్ర నిలిచిపోయింది. ఉదయం నుంచి జరిపిన చర్చలతో సాయంత్రం 7.30 సమయంలో పోలీసులు అనుమతించారు. అయితే కేవలం రెండు స్పీకర్లు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. పోలీసులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో గణనాథులు గంగమ్మ చెంతకు వెళ్తున్నారు.
ఇదీ చూడండి:Khairatabad Ganesh: జలప్రవేశం చేసిన ఖైరతాబాద్ మహారుద్ర గణపతి