తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2020, 1:34 PM IST

ETV Bharat / state

'సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీకి దాసోహమయ్యారు'

తెలంగాణలో మత కలహాలు సృష్టించేందుకు తెరాస, ఎంఐఎం కుట్ర పన్నుతున్నట్టు భైంసాలో జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. ఓ చిన్న తగాద మత విద్వేషానికి దారి తీయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

BJP Laxman Fires on TRS Government
BJP Laxman Fires on TRS Government

నిర్మల్ జిల్లా భైంసాలో హిందువులు, భాజపా కార్యకర్తలపై దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ఎంఐఎం గూండాలు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్టు... ఇళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన తెలిపారు.

బాధితులను పరామర్శించడానికి వెళ్లిన భాజపా ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావులను అడ్డుకొని, పోలీస్ స్టేషన్​కు తరలించడంపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే పోలీసుల ద్వారా అణచివేతలకు పాల్పడుతుందని స్పష్టమవుతుందన్నారు. ఓ వర్గం ప్రజలు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతుంటే పట్టించుకోని పోలీసులు పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

తెరాస, ఎంఐఎం మిలాఖత్...

సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీకి పూర్తిగా దాసోహమయ్యారని లక్ష్మణ్ విమర్శించారు. తెరాస సాయంతో భైంసాలోని 7 స్థానాల్లో ఎంఐఎం ఏకగ్రీవంగా గెలవడం కేసీఆర్, ఓవైసీ మిలాఖత్ అయ్యారనడానికి అద్దం పడుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక ర్యాలీల పేరుతో ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొడుతోందని దుయ్యబట్టారు. అధికారిక తెరాస, ఎంఐఎం ప్రోద్బలంతో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ర్యాలీల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి...

తెలంగాణ ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా మారిందని లక్ష్మణ్ తెలిపారు. ఏ క్షణమైనా మత విద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. భైంసా ఘటనలకు కేసీఆర్​దే బాధ్యతన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలపై న్యాయ విచారణ జరిపించి, దుండగులకు కఠిన శిక్షలు పడేలా చూసి , బాధితులకు న్యాయం చేయాలన్నారు.

భైంసాలో ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితులు లేవని... అభ్యర్థులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. అక్కడ అల్లర్లను అదుపు చేసి... శాంతి నెలకొనే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని లక్ష్మణ్ డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details