భారతీయ జనతాపార్టీ శుక్రవారం నిర్మల్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరు కానుండడంతో గతంలో ఎన్నడూలేని రీతిలో భాజపా శ్రేణులు జనసమీకరణ చేస్తున్నాయి. ఈ సభకు మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం పాదయాత్రకు విరామం తీసుకుని సభలో పాల్గొననున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్న భాజపా.. తమ డిమాండ్‌ను ఈ సభ ద్వారా మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తొలుత హైదరాబాద్ వచ్చి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని నిర్మల్ వెళ్లేలా ప్రణాళిక సిద్ధమైనా.. తరువాత షెడ్యూలు మారింది. ఆయన నాందేడ్‌కు విమానంలో వచ్చి అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్ చేరుకుంటారు. శుక్రవారం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సభ ప్రాంగణంలో అమిత్‌షా మొక్కలు నాటడంతో పాటు రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు.
BJP: నేడే నిర్మల్‌లో భాజపా భారీ బహిరంగ సభ.. కేంద్రమంత్రి అమిత్ షా రాక - Nirmal district latest news
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు నిర్మల్ జిల్లా ముస్తాబైంది. రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో జరిగే సభకు కేంద్రమంత్రి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభకు లక్షమందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకంటే ఎక్కువే వస్తారని భాజపా శ్రేణులు అంచనా వేస్తున్నారు.
సభ విజయవంతంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంజయ్ మూడు రోజులుగా జిల్లా నేతలు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర నాయకులు భారీ జనసమీకరణకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని భైంసా, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే లక్ష మందిని రప్పించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. వర్షాలు, గాలులను తట్టుకునేలా మూడు సభావేదికలను సిద్ధం చేశారు. ప్రాంగణంలో భారీస్థాయి ఎల్‌ఈడీ తెరలను అమర్చారు. వాహన పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించారు.