Basara RGUKT: బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆందోళనపై గందరగోళం నెలకొంది. విద్యార్థులతో చర్చించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు చర్చలు సఫలమయ్యాయని చెబుతున్నారు. కానీ క్యాంపస్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. జోరు వర్షంలో సైతం విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించాలంటూ క్యాంపస్ విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. వరుసగా ఐదోరోజు విద్యార్థుల ఆందోళన కొనసాగింది. తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటం సాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.
విద్యార్థులతో చర్చించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్‌ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చర్చలు సఫలమ్యాయని చెబుతున్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడంతో సోమవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు చెప్పారని మంత్రి తెలిపారు. సమస్యల పరిష్కారినికి ఒప్పుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్వీట్లు చేయాలని విద్యార్థులు కోరారని తెలిపారు. వారి కోరిక మేరకు మంత్రులతో ట్వీట్ చేయించేందుకు ఒప్పుకున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. కానీ, క్యాంపస్‌లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జోరు వర్షంలో సైతం విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంత్రి ప్రకటనను ఖండిస్తున్నట్టు కొందరు విద్యార్థులు తెలిపారు.