తెలంగాణ

telangana

ETV Bharat / state

నాతో గడిపితే మార్కులు వేస్తా..అధ్యాపకుని లైంగిక వేధింపులు..

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. వసతి గృహంలో ఉన్న విద్యార్థినులకు తల్లిదండ్రుల వలే సంరక్షించాల్సింది పోయి... వారిని లైంగికంగా వేధించాడు. మార్కులు వేస్తానంటూ చాలాకాలంగా విద్యార్థినులను వేధిస్తున్నాడు.

By

Published : Jul 7, 2019, 8:01 AM IST

Updated : Jul 7, 2019, 3:28 PM IST

బాసర ఆర్జీయూకేటీలో...లైంగిక వేధింపులు

నాతో గడిపితే మార్కులు వేస్తా..అధ్యాపకుని లైంగిక వేధింపులు..

నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలోని ఓ విభాగాధిపతి అకృత్యాలు తాజాగా వెలుగుచూశాయి. ఓ విద్యార్థినికి అసభ్య సందేశాలు పంపి అధికారులకు దొరికిపోయాడు. ఆర్జీయూకేటీలో చదువుతున్న ఓ విద్యార్థిని కొన్ని రోజుల కిందట రెమీడియల్‌ (సప్లిమెంటరీ) పరీక్షల నిమిత్తం విద్యాలయానికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఔట్‌పాస్‌ నిమిత్తం మహిళా అధికారిణి (చీఫ్‌ వార్డెన్‌) దగ్గరకు వెళ్లగా, బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుమతి కావాలని, వారితో మాట్లాడిస్తే ఔట్‌పాస్‌ ఇస్తానన్నారు. దీంతో ఆ విద్యార్థిని తన తల్లికి ఫోన్‌ చేసివ్వగా చీఫ్‌వార్డెన్‌ మాట్లాడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు వచ్చాయి.

పాస్‌కావాలంటే ఇంటికి రావాలి

పరీక్షలో పాస్‌కావాలంటే రాత్రికి నిజామాబాద్‌లోని తన ఇంటికి రావాలని, అసభ్యకర సందేశాలు రాగా గమనించిన ఆ అధికారిణి విద్యార్థినిని విచారించారు. ఎవరి సెల్‌ఫోన్‌ నుంచి ఈ సందేశాలు వచ్చాయో గుర్తించిన ఆ అధికారిణి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు విద్యార్థినిని ఆర్జీయూకేటీ మహిళాసెల్‌కు అప్పగించారు. వారు ఆమెను తమ అధీనంలో ఉంచుకుని ఫోన్‌ సీజ్‌ చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించి విచారించగా అతని లీలలు బయటపడ్డాయి.
అధికారుల దృష్టికి వచ్చినా
అధ్యాపకుడిపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నప్పటికీ దొరక్కుండా తప్పించుకున్నాడు. ఔట్‌పాస్‌ పేరిట విద్యార్థినులను బయటకు పంపి రెండు, మూడు రోజులపాటు తనతో బయటకు తీసుకెళ్లేవాడు. సెలవుల్లో సైతం విద్యార్థినులను ఇంటి నుంచి రప్పించుకునేవాడు. ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా ఊదాసీనంగా వ్యవహరించడం వల్ల అతడి ఆగడాలు మరింత శృతిమించాయి. విభాగ అధిపతిగా తన అధికారాన్ని ఉపయోగించి సదరు అధ్యాపకుడు బాలికల వసతి గృహంలోనే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఫోన్లో వేధింపులు నిజమే!

వేధింపుల విషయమై విద్యాలయ పరిపాలన అధికారి శ్రీహరి వివరణ కోరగా విద్యార్థినిని తన ఇంటికి రమ్మని ఆమె సెల్‌ఫోన్‌కు రసాయనశాస్త్ర విభాగాధిపతి రవి వరాల సందేశాలు పంపాడని, పరీక్షల్లో మార్కులు వేసేందుకు డబ్బులు తీసుకున్నాడని తమ విచారణలో తేలిందన్నారు. మరికొందరు విద్యార్థినులను విచారిస్తామని తెలిపారు. సమగ్ర విచారణకు కమిటీని నియమించామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు అధ్యాపకునిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Last Updated : Jul 7, 2019, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details