Bandi Sanjay Praja Sangrama Yatra Begins: హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి నిర్మల్‌కు చేరుకున్న బండి సంజయ్‌కి.. ఎంపీ అర్వింద్, పార్టీ శ్రేణలు ఘనస్వాగతం పలికారు. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అడెల్లి పోచమ్మ ఆలయం నుంచే బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని తెలిపిన కోర్టు.. ఇతర మతాలకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయరాదని పేర్కొంది. సాయంత్రం ఐదింటి వరకు సభ నిర్వహించుకోవాలని షరతు విధించింది. సంజయ్ పాదయాత్రకు నిర్మల్ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ.. బీజేపీ నేతలు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.
ఈ విచారణలో బండి సంజయ్ పాదయాత్ర బైంసాలోకి వెళ్లదని.. ఈ మేరకు రోడ్ మ్యాప్‌ను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ఈ దశలో పాదయాత్ర.. బైంసాలోకి ప్రవేశించనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఇందుకు సమాధానమిచ్చిన ఏజీ బైంసా చాలా సున్నితమైన ప్రాంతమని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.