హద్దులు గుర్తించినా.. పరిరక్షణ చర్యలు కరవు - Pond lands occupied news
నిర్మల్ జిల్లాలో చెరువు భూముల ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించారు. వాటి చుట్టూ కట్ట (బండ్) ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. చెరువు శిఖం భూముల ఆక్రమణలకు కళ్లెం పడుతున్నా.. కబ్జాలో ఉన్న స్వర్ణ ప్రాజెక్టు భూములను ‘చెర’ నుంచి విడిపించలేకపోతున్నారు. అర శతాబ్దం క్రితం నాటి ఈ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఇదివరకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆసరగా తీసుకున్న కొంతమంది ఆ భూములను స్వాధీనం చేసుకుని పంటల పండిస్తున్నారు. ప్రాజెక్టు లోతట్టు, ఆయకట్టు అన్న తేడా లేకుండా ఆక్రమణలు చేస్తూనే ఉన్నా.. సంబంధితశాఖల అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు.
Authorities have focused on encroachment of pond lands in Nirmal district
By
Published : Oct 8, 2020, 10:58 AM IST
నిర్మల్ జిల్లాలో తొమ్మిది వేల ఆయకట్టుకు కల్పతరువుగా ఉన్న స్వర్ణ ప్రాజెక్టు భూముల రక్షణను గాలికి వదిలేశారు. వందల ఎకరాలు కబ్జాకు గురైనా సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోలేక పోతున్నారు. ఒకరికి మించి మరొకరు నీకు కొంత.. నాకు కొంత అనే ధోరణిలో అందరు కలిసికట్టుగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ ఆక్రమణల్లో లోతట్టు సమీప రైతులు ముందున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఆనుకొని ఉన్న స్వర్ణ భూముల్లో మట్టిని నింపి స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రాజెక్టు భూములను సొంతవాటిగా మార్పుచేసి పంటలు సాగుచేస్తున్నారు. మరికొందరు ఆనకట్ట దిగువ భూముల్లో ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యానవనం కోసం కేటాయించిన 35 ఎకరాల్లోనూ సగానికిపైగా భూములను కబ్జా చేశారు.
‘ఈనాడు- ఈటీవీ భారత్’ కథనంతో సర్వే
ఆక్రమణలతో అంతరించి పోతున్న స్వర్ణ ప్రాజెక్టుపై 2015లో ’ఈనాడు’ వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన అప్పటి ఉమ్మడి జిల్లా పాలనాధికారి జగన్‌మోహన్ ఆదేశాలతో స్వర్ణ ప్రాజెక్టు భూములపై సర్వే చేపట్టారు. 2015 మార్చి 3న నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సంయుక్తగా చేపట్టిన సర్వే వారం రోజుల పాటు కొనసాగింది. జలాశయం దిగువన 600 ఎకరాల ప్రాజెక్టు భూమి కబ్జాకు గురైనట్లు సర్వే అధికారులు గుర్తించారు. నీటి పారుదలశాఖకు నివేదికను సమర్పించారు. అయిదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆక్రమణకు గురైన భూములను నీటిపారుదలశాఖ తమ స్వాధీనంలోకి తీసుకోలేక పోవడం గమనార్హం.
శాశ్వత చర్యల్లేక.. పెరుగుతున్న ఆక్రమణలు
గతంలో చేపట్టిన సర్వేలో ప్రాజెక్టు భూములకు సంబంధించి హద్దులు గుర్తించినా.. వాటి రక్షణకు శాశ్వత చర్యలు లేకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. అయిదేళ్ల నుంచి మెల్లమెల్లగా ఈ భూములను తమ ఆధీనంలోకి తీసుకొని సాగు చేస్తూనే ఉన్నారు. అధికారుల నిర్లక్ష్య ఫలితంగా ఆక్రమణలు పెరుగుతూనే ఉన్నాయి.
ప్రాజెక్టు భూముల రక్షణకు చేపట్టే పనులకు నిధుల కొరత కారణంగా సర్వే సమయంలో శాశ్వత హద్దులను ఏర్పాటు చేయలేదని నీటి పారుదలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టు ఎడమ వైపునకు, ఆనకట్ట దిగువన జీపీఎస్ ద్వారా హద్దులు గుర్తించారు. వాటి ఆధారంగానే ఆనకట్ట దిగువన శాశ్వత హద్దులను సిమెంటు స్తంభాల ద్వారా నిర్మించినా.. ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు ఎడమ వైపు అక్షాంశ, రేఖాంశాల రికార్డులు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆనకట్ట దిగున హద్దురాళ్లను ఏర్పాటుచేసినా.. ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకోలేదు.
వారం రోజుల్లో సర్వే చేయిస్తాం
వారం రోజుల వ్యవధిలో మరోసారి సర్వే చేయిస్తాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గతంలో సర్వేలో పాల్గొన్న అధికారులు ఉంటే భూములను సులువుగా గుర్తించే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారుల సమన్వయంతో ప్రాజెక్టు భూముల సమగ్ర సర్వే చేయడానికి సన్నద్ధమవుతున్నాం. సర్వే పూర్తయ్యాక శాశ్వత హద్దులను వెంటనే ఏర్పాటు చేసి ఆక్రమణకు గురైన ప్రాజెక్టు భూములను స్వాధీనం చేసుకుంటాం.- అనిల్, డీఈ, స్వర్ణ ప్రాజెక్టు