Grand mother protecting 28 year old boy: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధని గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇప్పుడు 28 ఏళ్లు. పదో తరగతి వరకు అందరిలాగే ఆరోగ్యంగా ఉన్నాడు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఓ రోజు వీధిలో నడుస్తూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. పేదరికం వల్ల మెరుగైన వైద్యం చేయించకలేకపోవడంతో... కుడి చేయి, కుడి కాలు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. 80శాతం వరకూ అంగవైకల్యంతో బాధపడుతున్నాడు.
నరాల బలహీనత వేధిస్తుండటంతో... నడవలేడు, ఏ పనీ చేసుకోలేడు. స్వయంగా తినలేడు. కనీసం నీళ్లు సైతం తాగలేడు. వృద్ధురాలైన నాన్నమ్మే అన్ని తానై సపర్యలు చేస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఒక చిన్న రేకులపాకలో నివాసముంటున్నారు. ఉదయం లేచిన వేళ నుంచి లక్ష్మణ్‌కు అవసరమైన పనులన్నీ గంగమ్మే చేస్తుంది. తను ఎటైనా బయటకు వెళ్లాలంటే కుదరని పరిస్థితి. చేసేదేంలేక కూలీ పని మానేసింది. ఎదైనా అత్యవసరముండి వెళ్తే... ఆ రోజు లక్ష్మణ్ పస్తులుండాల్సిందే. తాను చనిపోతే మనవడి పరిస్థితి ఏంటా అని గంగమ్మ తల్లడిల్లిపోతోంది. నరాల బలహీనతతో బాధపడుతున్న యువకుడికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించి ఆదుకోవాలని గంగమ్మ వేడుకుంటోంది.