తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP: అధికారమే లక్ష్యంగా కమలనాథుల ముందడుగు.. రేపటి బహిరంగ సభకు అమిత్​షా - నిర్మల్​లో భాజపా బహిరంగ సభ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 17న భాజపా భారీ బహిరంగ సభకు (BJP public meeting) సన్నాహాలు చేస్తోంది. నిర్మల్‌ జిల్లా వెయ్యి ఊడలమర్రి వద్ద ఏర్పాటు చేసే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah )ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజు గజ్వేల్‌లో కాంగ్రెస్‌ దళిత, ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Amit Shah attend a BJP public meeting at veyyi Udalamarri in Nirmal District
అధికారమే లక్ష్యంగా కమలనాథుల ముందడుగు.. రేపటి బహిరంగ సభకు అమిత్​షా

By

Published : Sep 16, 2021, 7:01 AM IST

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కమలనాథులు (bjp) అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి ఇష్టపడడం లేదు. తెరాస ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తోన్న భాజపా నాయకులు... కేసీఆర్ (kcr) నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ (bandi sanjay) ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) పేరుతో ప్రజల్లోకి వెళ్లారు.‌ తెరాస ఇచ్చిన హామీలను అమలు చేయించడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను తెలంగాణ సమాజానికి వివరిస్తూ పాదయాత్రలో బండి సంజయ్‌ ముందుకు సాగుతున్నారు.

సభకు అమిత్‌ షా హాజరు

అసెంబ్లీ ఎన్నికల వరకు పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార తెరాసకు అసలైన ప్రత్యామ్నాయం భాజపాయేనన్న స్పష్టమైన సందేశం ప్రజలకు చేరవేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 17న నిర్మల్‌లో నిర్వహించే సభకు (BJP public meeting) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah )హాజరుకానుండడంతో సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. సభను లక్షలాది మందితో నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు.

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ...

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని భాజపా డిమాండ్‌ చేస్తూ వస్తోంది. ఈసారి పార్టీ అధ్యక్షుడి పాదయాత్ర సాగుతోన్న సమయంలోనే వస్తుండటంతో దీనిని భాజపా ఒక అవకాశంగా భావిస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని రజాకార్లు మర్రిచెట్టుకు ఊచకోత కోసిన నిర్మల్‌ జిల్లా వెయ్యి ఊడలమర్రి వద్ధ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభా వేదిక నుంచి మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గే తెరాస సర్కార్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదన్న విషయాన్ని సమాజానికి వివరించాలని నిర్ణయించింది. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్‌ పాదయాత్రకు విరామం ఇచ్చి నిర్మల్‌ సభలో పాల్గొననున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి.

కమలనాథుల్లో కలవరం

దిల్లీలో తెరాస పార్టీ కార్యాలయం నిర్మించుకునేందుకు కేంద్రం స్థలం కేటాయించడంతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సీఎం కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వటంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెరాస, భాజపా ఒక్కటేనని కాంగ్రెస్ పెద్దఎత్తున ప్రచారం మెదలు పెట్టింది. బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోన్న సమయంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిశారు. తెలంగాణ భాజపా నేతలు ఎన్ని మాట్లాడినా.. దిల్లీ పెద్దలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న సంకేతాలను ముఖ్యమంత్రి తెలంగాణ సమాజానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెరాస, కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌కు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతోనే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసిన కాషాయదళం అమిత్‌ షాను ఆహ్వానించింది. సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు సభ కొనసాగనుంది.

ప్రతిపక్షాల ప్రచారానికి చెక్‌

ఇదే రోజు గజ్వేల్‌లో జరగనున్న కాంగ్రెస్ సభకు ధీటుగా తమ సభ ఉండాలని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న కమలనాథులు.... నిర్మల్‌ సభతో తెరాస, భాజపా ఒక్కటేనన్న ప్రతిపక్షాల ప్రచారానికి చెక్‌ పెట్టాలని భావిస్తోంది.

ఇదీ చూడండి: MP Arvind: మంత్రి కేటీఆర్‌కు భాజపా ఎంపీ అర్వింద్‌ సవాల్‌.. అసలేమైంది?!

ABOUT THE AUTHOR

...view details