తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganja smuggling: యువతపై గంజాయి పంజా... ప్రేక్షకపాత్రలో ఆబ్కారీశాఖ - cannabis smuggling in adilabad district

ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన యువకులు.. వ్యసనాలకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కిక్కు కోసం అడ్డదార్లు తొక్కుతూ మత్తులో చిత్తు అవుతున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. అడ్డు చెప్పినవాళ్లపై చేయిచేసుకోవడం, ఇంట్లో సామగ్రిని విసిరేయడం, బిగ్గరగా అరవడం వంటి వికృత చేష్టలు చేస్తున్నారు. ఇలా యువత నాశనం అవుతున్నప్పటికీ ఆ ఉమ్మడి జిల్లా ఆబ్కారీశాఖ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది.

Ganja smuggling
Ganja smuggling

By

Published : Oct 5, 2021, 10:43 AM IST

ఆయనో 35ఏళ్ల యువకుడు. నిర్మల్‌ జిల్లాకు వలస వచ్చిన ఓ పల్లెవాసి. రెండు, మూడేళ్ల వరకు ఆరోగ్యంతో బాగానే ఉన్నాడు. కానీ ఇటీవల ఆయన నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. ఒంటిరిగా ఉండటం తప్పా నలుగురిలో కలవడంలేదు. ఆరోగ్యం క్రమంగా చెడిపోతుంది. కారణమేంటంటే ఆయన గంజాయికి బానిసయ్యాడు. మత్తుకు బానిసైన కొడుకుని చూసి తల్లిదండ్రులు కంటతడిపెట్టుకోవడం తప్పా చేసేదేమి లేనిపరిస్థితి ఏర్పడింది. ఇలాగే ఆదిలాబాద్‌కు ఆనుకొని ఉండే ఓ పల్లెటూరులో 25 ఏళ్ల యువకుడు సిగరేట్‌లో గంజాయిని నింపి సేవిస్తూ మత్తులో మునిగి తల్లిదండ్రులను కొడుతున్నాడు. కొడుకు పరిస్థితి చూసి చేసేదేమిలేక వారు ఇంటిబయటే ఉంటున్నారు. వయసు మీద పడటంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ముత్తు పదార్థలు తమ కుటుంబాన్ని నాశనం చేసిందంటూ వాపోతున్నారు.

ఇలా ఒకటి కాదు... రెండు కాదు.. ఉమ్మడి జిల్లాలో గంజాయి ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. వారి కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోజుకో చోట గంజాయిపట్టివేత అనే వార్త బయటకు వస్తూనే ఉందంటే దాని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్‌గంగా, ప్రాణహిత నదీ తీరాలతోపాటు మారుమూల అటవీప్రాంతాల్లో అంతరపంటగా గంజాయిసాగవుతోంది. సాగు చేయడం ఒక ఎత్తయితే దానిని గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా రవాణా చేయడం మరోఎత్తు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, కాగజ్‌నగర్, బాసర, ఆదిలాబాద్‌ రైల్వే మార్గాలతోపాటు ఆటోలు, బస్సుల్లో అక్రమరవాణా చేస్తున్నారు. అయినప్పటికీ ఆబ్కారీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

కేంద్రబిందువు..

హైదరాబాద్‌, నాగపూర్, ముంబాయి, కర్ణాటక మధ్య జరిగే గంజాయి అక్రమ రవాణాకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రబిందువుగా మారింది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపేలా మంచిర్యాల, ఆదిలాబాద్, బాసర రైల్వే మార్గం ఉండటంతో అక్రమార్కులకు కలిసివస్తుంది. పోలీసులు చేసే సాధారణ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు వెల్లడవుతూనే ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారంపై అధికారయంత్రాంగం దృష్టిపెట్టడంలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమరవాణా చేస్తున్న 45 కేసులు నమోదవగా 86 మంది అరెస్ట్ అయ్యారు.​ దాదాపుగా 805కిలోల గంజాయి పట్టుబడింది. ఇది సాధారణ తనిఖీల్లో భాగమే. ఇక అనధికారిక దందా అధికారయంత్రాంగానికి సవాలుగా మారుతోంది.

చేతులెత్తేసిన ఆబ్కారీశాఖ..

గంజాయి అక్రమసాగునీ, అక్రమరవాణాను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించే ఆబ్కారీశాఖ చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌- నిర్మల్‌ జిల్లాలకు కలిపి ఒక్కరే ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఉంటే, కుమురంభీం- మంచిర్యాల వేర్వేరుగా ఉన్నప్పటికీ అధికారుల మధ్య సమన్వయం కుదరడంలేదు. ఫలితంగా గంజాయి అక్రమ రవాణా దారులకు అనుకూలంగా మారింది. ఏఏ ప్రాంతాల్లో గంజాయిసాగవుతుందో..? ప్రధాన నిందితులు ఎవరు..? వారివెనుక ఉన్న సూత్రదారులు ఎవరనేది ఆబ్కారీశాఖాధికారులకు తెలిసిన పట్టించుకోవడంలేదనేది ప్రధాన ఆరోపణ. పోలీసులు తనిఖీలు చేస్తే తప్పా క్షేత్రస్థాయికి వెళ్లడానికి మధ్యంశాఖాధికారులు ఆసక్తిచూపడంలేదు. వాస్తవంగా కిలో రూ.10వేల వరకు పలుకుతున్న గంజాయి హైదరాబాద్, నాగపూర్, ముంబయి, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు తరలించి ఎండపెడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అక్కడ ఎండిన తరువాత అదే గంజాయిని పొడిగా మార్చి తిరిగి ఒక్కో గ్రాముకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పలుకుతుండటంతో సులువుగా డబ్బుసంపాదించాలనే ఆతృత కొంతమందిని అటువైపు వెళ్లేలా చేస్తోంది. రాజకీయాలతో సంబంధం ఉండి హంగూ ఆర్భాటాలకు వెళ్తున్న కొంతమంది యువత సైతం ఈ రొంపిలో పడుతుండటం విషసంస్కృతికి దారితీస్తోంది.

మీరేమి చెప్పొద్దు... చీమ చిటుక్కుమన్నా నేనే చెప్పాలి...

ఉమ్మడి జిల్లాలో ఓ ఆబ్కారీశాఖాధికారి పనితీరు తీవ్రవిమర్శలకు దారితీస్తోంది. నా అనుమతిలేనిదే ఎవరికీ ఏమీ చెప్పొద్దని కిందిస్థాయి సిబ్బందిని కట్టడి చేయడమే కాకుండా ఉన్నతాధికారులు అడిగితే టూర్‌ వెళ్లినట్లు చెప్పాలని ఆదేశించడం ఆయన నైజాన్ని వెల్లడిస్తోంది. చీమ చిటుక్కుమన్నా నేనే చెప్పాలి. పోనీ ఆయనైనా ఇతరులకు అందుబాటులోకి వస్తారా..? అదీలేదు. యంత్రాంగానికి దిశానిర్ధేశం చేయాల్సిన ఆయన పోలీసులు చూసుకుంటారులే? మీకెందుకు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

ఇదీ చదవండి:Sexual Harassment on a Minor Girl : ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారయత్నం

ABOUT THE AUTHOR

...view details