దేవాదాయశాఖమంత్రి ఇలాకలో.. కొండంత నిర్లక్ష్యం!! పిల్లలకు బాసర సరసత్వీ అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడమనేది తెలుగురాష్ట్రాల్లోనే కాదు... దక్షిణాదిన లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే కల. గోదావరి పుణ్యస్నానం.. చేయడమనేది పుణ్యఫలంగా భావిస్తారు. అధికారుల నిర్లక్ష్యం... ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనం వల్ల గోదావరి ఘాట్ తీరమంతా అస్తవ్యస్తంగా మారింది. మహారాష్ట్రలోని పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలతో నీరు కలుషితమవుతోంది. పేరుకుపోయిన బురద, చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతూ భక్తుల సహనానికి పరీక్ష పెడుతోంది.
బాసరలో గంగ దగ్గర వాష్‌రూంలు సరిగ్గా లేవు. మొత్తం బురద బురదగా ఉంది. అక్కడికి వెళ్తే.. పడిపోయేటట్టు ఉన్నాం. అంతా చెత్త చెదారం ఇక్కడే వదిలేస్తున్నారు. - -లావణ్య, కామారెడ్డి జిల్లా
బాసర ప్రధాన స్నానఘాట్ పైభాగంలో గంగమ్మ విగ్రహం, ఘాట్ కింద భాగం మెట్ల వద్ద శివలింగం ఉంది. ఏళ్లుగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేయడం వల్ల పవిత్ర శివలింగం కళ తప్పుతోంది.
దాదాపు 450 కి.మీటర్ల దూరం నుంచి వచ్చాం.. ఎంట్రన్స్‌లోనే శుభ్రం లేకుండా చెత్తచెదారం ఉంది. అసలు ఎక్కడా పరిశుభ్రతా లేదు. గోదావరి వద్ద మొత్తం చెత్త పేరుకుపోయింది. వాడిపడేసిన వస్తువులు, మట్టి చేరింది. వెంటనే ఈ ఘాట్‌లను శుభ్రం చేయాలని కోరుతున్నాం. - వెంకటేశ్, మహాబూబ్‌నగర్ జిల్లా
మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్‌లో పుట్టిన గోదారమ్మ.... బాసర వద్ద చదువులమ్మ పాదాలను తాకి తెలుగురాష్ట్రాల్లోకి అడుగిడుతుంది. ఎగువన భారీ వర్షాలు కురిసినపుడు వచ్చే వరదలతో ఘాట్లు పరిశుభ్రమవుతున్నాయే తప్ప.... అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. పుష్కరాల సమయంలో 10 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఘాట్లు అధ్వాన నిర్వహణతో కళావిహీనంగా మారిపోయాయి. ఫలితంగా పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.
పిల్లలకు అక్షరాభ్యసం చేపిద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బందులు ఉన్నాయి. గోదావరి నది అంటే.. పవిత్రమైంది. కానీ ఇక్కడ వాటర్ కలుషితమైంది. స్నానం కాదు కదా.. కనీసం నీళ్లు చల్లుకుందామంటే కూడా రోగాలు వస్తాయని భావన కలుగుతోంది. - మౌనిక, హైదరాబాద్