నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన రమణారెడ్డి డెయిరీ కేంద్రంలో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన వద్ద ఒక జెర్సీ ఆవు దూడ చనిపోవడంతో పాలకోసం దూడ కళేబరాన్ని ఆ పక్కన వేలాడదీశాడు. ఇదేమిటీ అనుకుంటున్నారా.! అవును అక్కడ ఉన్నది దూడ బొమ్మ కాదు. నిజమైన దూడ శరీరమే. ఏంటీ వినగానే ఆశ్చర్యం కలుగుతోందా.! కాకపోతే అది చనిపోయింది. ఇటీవల హరియాణా ప్రాంతం నుంచి గర్భంతో ఉన్న ఈ ఆవును తీసుకొస్తున్న సమయంలోనే ఈనింది. పుట్టిన వెంటనే లేగదూడ చనిపోయింది. ఈ విషయం దానికి తెలియదు. లేగ దూడ లేకపోతే అది పాలివ్వదు. అలాగని మృత కళేబరాన్ని అలాగే వదిలేస్తే కుళ్లిపోతుంది. దీంతో వైద్యుల సూచన మేరకు దూడ శరీరం లోపలి అవయవాలు జాగ్రత్తగా తొలగించి అచ్చం దూడలాగే రూపొందించాడు ఆ యజమాని.
ఆ మాతృమూర్తికి తెలియదు తన బిడ్డ ఇకలేదని..! - నిర్మల్ జిల్లా వార్తలు
ప్రపంచంలో మాతృప్రేమకు వెలకట్టలేము. మాతృత్వానికి మరేదీ సాటిరాదు. మరే దాంతో సరిపోల్చలేము. అందుకే దేవుడు సైతం తరచూ కొత్త అవతారాలు ఎత్తుతూ మాతృ ప్రేమను అనుభవిస్తుంటాడని కొందరు చెప్తుంటారు. ఇది కేవలం మనుషులకే కాదండోయ్. మూగజీవాలు సైతం తమ పిల్లల కోసం పరితపిస్తాయి. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే మాతృత్వ గొప్పతనానికి నిదర్శనం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కమలానగర్లో గల డెయిరీలో కనిపించిన ఈ దృశ్యం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆ మాతృమూర్తికి తెలియదు తన బిడ్డ ఇకలేదని..!
వైద్యుల సూచనలతో కళేబరాన్ని శుభ్రం చేసి.. చెడిపోకుండా గడ్డి, ఉప్పుతో నింపి, కర్రల సాయంతో దూడ శరీరంలాగే సిద్ధం చేశారు. ప్రతిరోజూ పాలు పితికే సమయంలో ఆవు ముందు ఈ దూడ కళేబరం ఉంచడంతో అది ప్రేమగా దాన్ని నాకుతూ మాతృప్రేమను చూపిస్తోంది. అవన్నీ తన బిడ్డకోసమేనని ఆనందంగా పాలిస్తోంది. చదివేవారినే కాదు, చూసేవారి కళ్లు సైతం చెమర్చేలా ఉన్న ఈ దృశ్యం మాతృత్వపు మమకారానికి నిలువెత్తు నిదర్శనం.