రూ. 360 కోట్లతో.. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. గద్వాల, నారాయణపేట, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, సిరిసిల్ల, నర్సంపేటల్లోని పాత దవాఖానాల స్థానాల్లో వీటిని నిర్మిస్తారు. ఒక్కో దవాఖానాకు సుమారు రూ.45 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. మార్చి 2023లోగా నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో శరవేగంగా పనులను ప్రారంభించడంపై వైద్యఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది.
కొత్త ఆసుపత్రుల నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం రూ.360 కోట్లలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను భరించనున్నాయి. వీటిలో రూ.214కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మిగతావి వచ్చే ఆర్థిక సంవత్సరం రానున్నాయి. పైన పేర్కొన్న దవాఖానాలన్నీ ప్రస్తుతం ఏరియా ఆసుపత్రుల స్థాయిలోనే ఉన్నాయి. ఆ మేరకే స్పెషలిస్టు వైద్యుల సేవలూ అందుతున్నాయి. కొత్తగా జిల్లా ఆసుపత్రులుగా అభివృద్ధి చెందనుండడంతో వీటిలో స్పెషలిస్టు వైద్యసేవలు పెరగనున్నాయి. నయా దవాఖానాల నిర్మాణంతో ఒక్కోచోట కనీసం 250-300 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా రోగులకు మెరుగైన, నాణ్యయమైన వైద్యసేవలు అందించడానికి వీలవుతుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
4 నూతన బోధనాసుపత్రులు సైతం..
మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటల్లోని సర్కారు దవాఖానాల స్థానాల్లో కొత్తగా 1000 పడకలతో అధునాతన బోధనాసుపత్రులను నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇక్కడున్న ఆసుపత్రులకు అనుబంధంగా ప్రభుత్వ వైద్యకళాశాలలు సేవలందిస్తుండడంతో..కొత్త ఆసుపత్రుల నిర్మాణంపై సర్కారు దృష్టిపెట్టింది.