'ఆటాపాటా మా ఇంట్లో.. మాపటి భోజనం మీ ఇంట్లో అన్నట్లుంది' తెలంగాణలో తెరాస పాలన అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila speech) వ్యాఖ్యానించారు. పాలకులే బీసీలు ఎదగకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణ పేట జిల్లా కోస్గిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్యర్యంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో షర్మిల(YS Sharmila speech) పాల్గొన్నారు. తెరాస పాలనలో బీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు.
'పాలకులే తెలంగాణలో బీసీలు ఎదగకుండా చేస్తున్నారు. బర్రెలు, గొర్రెలు ఇచ్చి వాళ్లను చదువులకు దూరం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దళిత బంధులాగే బీసీ బంధు అని ప్రజలను మభ్యపెడుతున్నారు. రూ.2వేల పింఛన్లు ఇస్తే నేతన్నలు యజమానులు అవుతారా? మదిరాజ్లను రాజులను చేస్తా అన్నారు. చేప పిల్లలు ఇస్తే రాజులైనట్టేనా. ఏ పథకం అయినా రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అక్కడ అమలవుతుంది. అయిపోగానే మాయమవుతుంది. కులవృత్తులను చేసుకొని బతకండి అనే నాయకులను మీరు ప్రశ్నించండి.. మీరెందుకు కులవృత్తులు చేసుకోరు అని.'