నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన నరేందర్ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 25 ఏళ్ల నరేందర్ 4 నెలల కిందట ముంబయి వలస వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చి వివాహం చేసుకున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో నూతన దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి ఎడవెల్లి గ్రామ శివారులో రైల్వేలైన్ కోసం తవ్విన గోతిలో చేరిన నీటిలో ఈతకు వెళ్లారు.
ఈత రాకున్నా...
నరేందర్‌కు స్నేహితులు గట్టుపై తమ దుస్తుల వద్ద ఉండాలని సూచించి వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నరేందర్ లేకపోయేసరికి వెతకడం ప్రారంభించారు. అప్పటికే నరేందర్ తనకు ఈత రాకున్నా నీటిలోకి వెళ్లి నీటమునిగి శవమై తేలాడు. మృతదేహాన్ని బయటకు తీసిన స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వలస వెళ్లి కుటుంబానికి ఆసరాగా ఉండే కొడుకు మృత్యువాతతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి : చెరువు కట్టపైన తాగాడు... చెరువులో పడ్డాడు..!