KTR on Krishna Water Dispute : కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నరేళ్లు అవుతున్నా నేటికీ కృష్ణా జలాల వాటా తేల్చలేదన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్‌అలీతో కలిసి మంగళవారం ఆయన రూ.196 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘ప్రగతి నివేదిన సభ’లో కేటీఆర్ మాట్లాడారు.
KTR comments on Krishna Water Dispute : కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌కు ఓ ఉత్తరం రాయడానికి కూడా కేంద్రానికి తీరిక లేదని కేటీఆర్ అన్నారు. పాలమూరు ఎండాలనే దురాలోచనతో ఉన్నారని దుయ్యబట్టారు. 813 టీఎంసీల కృష్ణా జలాల్లో వాటాతేల్చలేదని, ఈ బేసిన్‌లోనే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్ మహానగరం ఉన్నాయన్నారు. నీళ్ల పంపకాలు చేపట్టకపోయినా ఉమ్మడి పాలమూరులో 11 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో అవసరాలు ఎక్కువ ఉన్నాయని రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు లాంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
ప్రధాని మోదీ పాలమూరులో ఏ ముఖం పెట్టుకుని పోటీచేస్తారు..పాలమూరులో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏవేవో అనవసర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ పార్టీ నాయకులకు దమ్ముంటే కృష్ణాజలాల్లో 500 టీఎంసీల వాటా కేటాయించాలని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే విషయంలో వైఖరిని స్పష్టం చేయాలన్నారు.
KTR Narayanapeta tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మతాల మధ్య చిచ్చుపెడుతూ మసీదులు తవ్వుతామని పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ పాలమూరు జిల్లాలో పోటీ చేయాలని వాళ్ల రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారని.. ప్రధాని ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కోర్టులో కేసులు వేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్నాయన్నారు. న్యాయ పోరాటం చేసైనా ప్రాజెక్టు పూర్తిచేసి నీరందిస్తామని హామీ ఇచ్చారు.