తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకలు.. ప్రాచుర్యం కోల్పోయిన నిలువురాళ్లు

కాలం గర్భంలో కలిసిపోయిన ఆదిమానవుని చరిత్రకు సజీవ సాక్ష్యం ఆ ప్రాంతం. వేల ఏళ్ల కిందట జరిగిన ఖగోళ పరిశోధనలకు కేంద్రం ఆ ప్రాంతం. తెలంగాణలో మాత్రమే కనిపించే అపురూప భారతీయ వారసత్వ సంపద.. నిలువు రాళ్లు.. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్​లో ఉంది. అంతటి ప్రాధాన్యమున్న నిలువురాళ్లు.. నేడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన రక్షణ, ప్రచారం, సౌకర్యాలు లేక ప్రాచుర్యాన్ని కోల్పోతున్నాయి.

niluvu rallu in narayanapeta
ప్రాచుర్యం కోల్పోయిన నిలువురాళ్లు

By

Published : Oct 1, 2020, 3:23 PM IST

Updated : Oct 1, 2020, 8:04 PM IST

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూ అప్పట్లోనే నీడ ఆధారంగా దిక్కులు, బుుతువులు, సూర్యుని గమనాన్ని లెక్కగట్టిన మానవుని మేధస్సుకు ప్రతిరూపం నిలువు రాళ్లు. తెలంగాణలో మాత్రమే కనిపించే అపురూప భారతీయ వారసత్వ సంపద.. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్​లోని నిలువురాళ్లు. ఆదిమానవుల చరిత్రను నేటి తరానికి తెలియజెప్పే ఇలాంటి నిలువు రాళ్లు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేవు. పురావస్తు పరిభాషలో ఇవి ఆదిమానవుల సమాధులు.

80కిపైగా నిలువు రాళ్లు

తెలంగాణ వ్యాప్తంగా ఈ తరహా నిలువురాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నా, ఇంత పెద్దమొత్తంలో ఉండటం ఒక్క ముడుమాల్ లోనే చూస్తాం. 80కి పైగా నిలువు రాళ్లతో పాటు.. బంతి రాళ్లు, వృత్తాకారంలో ఉన్న రాతి సమాధులు సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటడం ముడుమాల్ ప్రత్యేకత. ఈ ప్రాంతానికి ఆనుకునే ఆదిమానవుల ఆవాసాలు ఉన్నట్లుగా పరిశోధనల్లో వెల్లడైంది.

ప్రాచుర్యం కోల్పోయిన నిలువురాళ్లు

సప్తర్షి నక్షత్ర మండలం

క్రీస్తు పూర్వం 5వేల ఏళ్ల కిందటే ముడుమాల్​లో ఆదిమానవులు ఖగోళ పరిశోధనశాలను ఏర్పాటు చేసినట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిలువు రాళ్లు, వృత్తాకార రాతి సమాధులకు సమీపంలో రాతిపై చెక్కిన సప్తర్షి నక్షత్త మండలమే అందుకు సాక్షంగా నిలుస్తోంది. ఈ నక్షత్ర మండలం ఆకాశంలోని నక్షత్ర మండలాన్ని సరిగ్గా పోలి ఉంటుంది. దీని ఆధారంగానే అప్పట్లో మానవులు దిక్కులను, బుుతువులను, దక్షిణ, ఉత్తరాయణ కాలాలను లెక్కించే వాళ్లని.. పరిశోధనల్లో తేలింది. అక్కడున్న నిలువురాళ్లు ఓ పద్ధతి ప్రకారం పాతారని.. వాటి నీడల ఆధారంగా ఎండా,వాన, చలికాలాల రాకను, బుుతువులను, సూర్యుని గమనాన్ని, దిక్కులనూ అంచనా వేసేవారని తెలుస్తోంది.

నిలువు రాళ్లపై నిర్లక్ష్యమేలా?

అంతటి ప్రాధాన్యమున్న నిలువురాళ్లు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 80కి పైగా ఉండాల్సిన నిలువు రాళ్లలో ఇప్పటికే 40కి పైగా పడిపోయి కనిపిస్తాయి. పట్టా భూముల్లో ఉన్న నిలువు రాళ్లను రక్షించేందుకు సుమారు రూ. 29 లక్షలు వెచ్చించి.. రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి 5 ఎకరాల స్థలంలో కంచెను ఏర్పాటు చేశారు. రక్షిత ప్రదేశమంటూ బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. ఆ తర్వాత పట్టించుకున్న నాథుడు లేడు. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి పశువుల మేత ప్రదేశంగా మారింది. కనీసం నిలువురాళ్ల ప్రత్యేకత ఎంటో చెప్పే ఒక్క బోర్డు అక్కడ కనిపించదు. వాటిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఫొటోలు దిగి వెళ్లడం తప్ప వాటి ప్రాధాన్యమేమిటో వివరించే దిక్కే లేదు. దేశ, విదేశాల నుంచి పరిశోధకులు వచ్చే ప్రదేశంలో కనీసం నీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. రక్షణ కోసం వాచ్ మెన్ కూడా లేడు.

రాళ్లు తొలగించి వ్యవసాయం

ప్రభుత్వ భూముల్లో ఉన్న రాళ్లను తొలగించి కొందరు ఏకంగా వ్యవసాయం చేస్తున్నారు. సుమారు 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సమాధుల ప్రదేశంలో సాగు కోసమో.. ఇతర అవసరాల కోసమో తవ్వకాలు జరిపినప్పుడల్లా అప్పటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వస్తువులు బైట పడుతూనే ఉన్నాయి.

నిర్లక్ష్యం వీడి.. అభివృద్ధి చేయండి

నిలువు రాళ్లను చూడాలనుకుంటే హైదరాబాద్- రాయచూర్ మార్గంలో మాగనూర్ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ రహదారిపై నిలువురాళ్లకు దారిని తెలిపే ఒక్క సూచిక బోర్డు కూడా లేదు. ఇక నిలువు రాళ్లకు వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఎలాంటి రవాణా సౌకర్యమూ లేదు. ప్రస్తుతం నిలువురాళ్లున్న ప్రాంతం పురావస్తు శాఖ అధీనంలో ఉంది. ఇప్పటికైనా నారాయణపేట జిల్లా యంత్రాంగం స్పందించి నిలువురాళ్ల ప్రదేశాన్ని అభివృద్ధి చేసి పర్యటక ప్రదేశంగా మార్చాలని, అరుదైన భారతీయ వారసత్వ సంపదను కాపాడి, ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నారు.

Last Updated : Oct 1, 2020, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details