నారాయణపేట జిల్లా కేంద్రానికి మరికల్ పట్టణం 30 కి.మీ దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు మరికల్ మీదుగానే జిల్లా కేంద్రాన్ని చేరుకోవాలి. ఏటా ఇంటిపన్నుల ద్వారా గ్రామపంచాయతీకి రూ. 20.40 లక్షల ఆదాయం వస్తుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మరో రూ.యాభై లక్షలు వస్తోంది. ఇలా ఏటా వస్తున్న రూ.70 లక్షలతో శాశ్వతమైన పారిశుద్ధ్య సమస్యలను అధికారులు పరిష్కరించలేకపోతున్నారు.
సమస్యల పుట్టగా పట్టణం..
మరికల్లో సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడం, అంతర్గత రహదారులు శిథిలమై గుంతలు పడటం, గుంతల్లో నిలిచిన మురుగు నీటిలో దోమల నిలయంగా మారింది. పందుల స్వైరవిహారంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలతో రోగాల బారిన పడుతున్నామని.. పెరగుతున్న వరాహాల సంఖ్యకు అడ్డుకట్టవేయక అవి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. వాన కురిస్తే అడుగు తీసి బయట పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు.