రాష్ట్రంలో కొవిడ్ కేసులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షల శాతం చాలా తక్కువగా నమోదైనట్లు కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గతేడాది మార్చిలో కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 8 నాటికి రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం నిర్ధరణ పరీక్షల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు కేవలం 17.51 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. గత 17 నెలల్లో 82 శాతానికి పైగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలే నిర్వహించారని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,76,131 ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే నిర్వహించారని తాజా నివేదికలో స్పష్టంచేసింది.
ప్రస్తుత ఆగస్టు నెలలో ఈ పరీక్షలు 10 శాతంలోపే ఉన్నట్లుగా కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వివరించింది. కొన్ని జిల్లాల్లో మరీ తక్కువ ఉండగా.. గత నెల 4 నుంచి ఈ నెల 8 వరకు నిర్వహించిన పరీక్షల్లో.. నారాయణపేట జిల్లాలో మొత్తం 14,350 నిర్ధరణ పరీక్షలు చేయగా వాటిలో కేవలం 10 మాత్రమే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలున్నాయి. నిజామాబాద్‌లో 38,249 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 61 మాత్రమే ఆర్‌టీపీసీఆర్ ద్వారా కొవిడ్ టెస్టులు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం లక్షా 35వేల 305 పరీక్షలు చేయగా.. 352 ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే చేసినట్లుగా వైద్యారోగ్య శాఖ గణాంకాల్లో నమోదైంది.