Lack of Facilities Narayanpet Govt Junior College : నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల.. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. సమీప గ్రామాల్లో పదోతరగతి పూర్తిచేసిన నిరుపేద విద్యార్థులకు, జిల్లావ్యాప్తంగా ఉర్దూ మాధ్యమంలో ఇంటర్ చదవాలనుకునే వారికి ఉన్న ఏకైక ప్రభుత్వ జూనియర్ కాలేజీ అది. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో నాలుగు విభాగాల్లో 12 కోర్సులు నడుస్తున్నాయి. 590 మంది విద్యార్ధులున్నారు. రెండు సంవత్సరాల విద్యార్థులకు కలిపి 30 గదులకు బదులుగా.. ఉన్న 8 గదుల్లోనే 24 తరగతుల్ని నెట్టుకొస్తున్నారు.
అంతకుముందు కళాశాల నడిచిన నిజాం కాలం నాటి కళాశాల కూలిపోయింది. పాత భవనం పక్కనే కొన్నేళ్ల క్రితం నిర్మించిన 6 గదుల్లో స్టాఫ్ రూం, ప్రిన్సిపల్ రూం, జిల్లా నోడల్ అధికారి కార్యాలయం వంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు కీలకమైన ప్రయోగశాలలకు ప్రత్యేక గదులు లేవు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబ్‌లకు.. 2 గదులు కేటాయించినా అందులోనూ పాఠాలు బోధిస్తున్నారు.
"చదవుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. తరగతిగదులు, ల్యాబ్‌లు కూడా లేవు. భవనం ఎప్పుడు కూలుతుందోనని భయం వేస్తుంది. భవనం పైనుంచి అన్ని పెచ్చులూడి మీద పడుతున్నాయి. కిటీకిలు, తలుపులు సరిగ్గా లేవు. టాయిలెట్స్ కూడా లేవు. విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం." - విద్యార్థులు
Narayanpet Govt Junior College Issues : మరోవైపు సరిపడ గదులు లేక ఉమ్మడి తరగతుల పేరుతో.. రెండు గ్రూపుల విద్యార్థులకు ఒకే గదిలో క్లాసులు జరుగుతున్నాయి. ఒక్కో బెంచిలో నలుగురు కూర్చుంటుండగా.. స్థలం సరిపోక మరికొందరు బయటే కూర్చుంటున్నారు. పాఠాలు వినబడక పాఠ్యాంశాలు అర్థం కావట్లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇక గదుల్లో ఫ్యాన్లు, లైట్లు వెలగక ఏళ్లు గడుస్తోంది. పాతభవనంలో గ్రంథాలయ గది శిథిలావస్థకు చేరటంతో మూసివేశారు. ప్రస్తుతం పిల్లలకు గ్రంథాలయం అందుబాటులో లేదు.