గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే వారి ప్రతిభకు ఎలా పదును పెడతారో.. ఎలాంటి ఫలితాలు సాధిస్తారో మరోసారి నిరూపించారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు. నారాయణపేట విద్యాశాఖ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేన్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు డిజిటల్ కోడింగ్ విధానంపై ఆన్లైన్లో శిక్షణ అందించారు.
13 ప్రభుత్వ పాఠశాలల నుంచి..
అందుకోసం స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండే 8,9వ తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థులను.. 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి ఎంపిక చేశారు. వీరికి సహాయకులుగా ఉండేందుకు ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి వారిని శిక్షణలో భాగస్వాములను చేశారు. శిక్షణ సులువుగా ముగిసేందుకు రోజూ రాత్రి ఏడు నుంచి ఎనమిదిన్నర గంటల వరకూ జూమ్ యాప్ ద్వారా కోడింగ్‌పై శిక్షణ అందించారు. ఫలితంగా.. స్మార్ట్ ఫోన్ వినియోగించడంలో ఓనమాలు కూడా తెలియని పిల్లలు ప్రస్తుతం కోడింగ్ ద్వారా యానిమేషన్ చేయడం, సొంతంగా మొబైల్లో ఆటలు రూపొందించే స్థాయికి ఎదిగారు. టీటా అందించిన ఈ శిక్షణ విద్యార్థుల సామర్థ్యాలను వెలికి తీయడంతోపాటు.. వారిపై నమ్మకాన్ని పెంచిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
వీడియో గేమ్స్ తయారు చేసేలా..
కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? కంప్యూటర్‌తో కమ్యూనికేషన్ ఎలా చేయాలి? ప్రోగ్రామింగ్, అల్గారిథం, కోడింగ్ అంటే ఏమిటి? వాటిని ఎలా చేయాలన్నది శిక్షణలో ఆన్లైన్లోనే నేర్పించారు. ప్రాథమికంగా ప్రోగ్రామింగ్ ఎలా రాయాలనే విషయాన్ని బోధించారు. పైథాన్ ద్వారా గేమ్స్, యానిమేషన్స్ నేర్పిస్తారు. రెండు వారాల శిక్షణ అనంతరం ప్రాథమిక స్థాయి వీడియో గేమ్ తయారు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం. శిక్షణ అనంతరం ర్యాట్ అండ్ క్యాట్, ప్రత్యేక రోజుల్లో యానిమేషన్స్ ద్వారా గ్రీటింగ్స్ లాంటివి విద్యార్థులు సొంతంగా తయారు చేసి వారి ప్రతిభను చాటుకున్నారు.