karnataka Paddy seize: ఇతర రాష్ట్రాల నుంచి వరిధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వరికి తక్కువ ధర చెల్లిస్తుండటంతో రాష్ట్రంలో అధిక ధరకు అమ్మేందుకు అక్రమంగా తీసుకొస్తుండగా.. పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ధాన్యాన్ని నారాయణపేట జిల్లాలో పట్టుకున్నారు. సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఎలాంటి అనుమతిలేకుండా తరలిస్తుండగా మక్తల్ మండలం చందాపూర్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. 16 లారీల్లో 8 వేల బస్తాల ధాన్యాన్ని కర్ణాటకలోని యాదగిరి, సిర్పూర్, మాన్విల నుంచి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ల వద్ద కాగితాలపై రాసుకున్న నకిలీ బిల్లులు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ధాన్యంతో పాటు పట్టుబడిన లారీలను మక్తల్ మార్కెట్ యార్డుకు తరలించి పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించారు.
కర్ణాటకలోని మాన్వి నుంచి ధాన్యం తేవాలంటే నారాయణపేట జిల్లా కృష్ణా చెక్‌పోస్టు యాదగిరి, సిరిపూర్ నుంచి తీసుకురావాలంటే కున్సీ చెక్‌పోస్టు దాటిరావాలి. వాటితో పాటు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దృష్ట్ట్యా ప్రభుత్వం నెలకొల్పిన రెవెన్యూ చెక్‌పోస్టులను దాటాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి, బిల్లులు లేని 16 లారీల ధాన్యం చెక్‌పోస్టులను దాటి ఎలా వచ్చిందన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడకి చెందిన కొందరు వ్యాపారులు.. కర్ణాటకలో రూ.1,500లకు క్వింటాల్ చొప్పున కొని.. తెలంగాణలోని కొనుగోలు కేంద్రాల్లో... రైతుల పేర్లపై 1,965కు విక్రయించి లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వే బిల్లులు లేకుండా మిర్యాలగూడ, హైదరాబాద్‌కు తరలించాలంటే మధ్యలో చాలా చెక్‌పోస్టులు దాటాలి. సరకు తరలించేందుకు డీజిల్ వ్యయం భారీగా అవుతుంది. అందుకే నారాయణపేట, కృష్ణా, మక్తల్ మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ నాయకుల మద్దతుతో అక్కడి రైతుల పేరిట విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.