ఆలోచనకు ఆశయం అద్దారు... జాతీయ పురస్కారం పొందారు ఒకప్పుడు చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు నారాయణపేట జిల్లా. ఈ ప్రాంత వాసులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేతే ఉపాధి. చీరల్లో రంగుల్లాగ వారి జీవితాలు సంతోషంగా సాగిపోయేవి. కాలక్రమేణా చేనేతకు ఆదరణ కరవైపోవడం వల్ల నేతన్నల బతుకులు ప్రశ్నార్థకమయ్యాయి. ఉపాధిలేక పూటగడవని పరిస్థితికొచ్చింది. అదే సమయంలో చాలా మంది మగ్గం వదిలి ఇతర మార్గాలను చూసుకున్నారు.
అలా మొదలైన ఆలోచన..
చేనేత తప్ప తమకు వేరే లోకం లేదనుకున్న స్థానిక డిజైనర్ నాగరాజు, నేతగాడు రాఘవేందర్... చేనేతలో కొత్త మార్గాలు అన్వేషించారు. ఏళ్ల తరబడి ఆదరణ పొందిన వస్త్రాలు... నేటి యువతకు ఆకట్టుకునేలా రూపొందించారు. ఆ ఆలోచనే వారికి జాతీయ చేనేత దినోత్సవం పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.
మొదట్లో ఒకేరంగులో చీరలు నేసేవారు. తర్వాత యువతను ఆకర్షించేలా రకరకాల రంగులు, డిజైన్లతో నేయడం ప్రారంభించారు. వీటితో ప్రజల్లో ఆదరణ పెరిగింది. మగ్గాలు నేసే కూలీలకు అదనంగా సొమ్ము ముడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చేనేత రంగంలో పూర్వ వైభవం తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు. కార్మికులకు ప్రభుత్వ పథకాలు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
పెరుగుతున్న ఆదరణ
నారాయణపేట చీరలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరు విడిచిన ఒక్కో కుటుంబం ఇంటిదారి పట్టాయి. ప్రభుత్వం నుంచి సహకారం మొదలైంది. మగ్గం జీవుల బతుకుల్లో కొత్త వెలుగులొచ్చాయి. దీనిని గుర్తించి చేనేత జాతీయ చేనేత పురష్కారం తెచ్చిపెట్టింది. ప్రభుత్వం మరింత సహకారం అందిస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని చెబుతున్నారు ఇక్కడి ప్రజలు.
ఇవీ చూడండి:బైరామల్‌గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్