నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలిక తల్లిదండ్రులు వారి ఇద్దరి కుమారుల బాధ్యతను ఆమెకు అప్పగించి హైదరాబాద్కు వలస వెళ్లారు. నాలుగు, ఆరు తరగతులు చదువుతున్న తమ్ముళ్లను ఎవరి సాయం లేకుండా పదో తరగతి చదువుతోన్న ఆ బాలిక కంటికి రెప్పలా చూసుకునేది. ఇంటి పక్కనే ఉండే ఇంటర్ విద్యార్థి ప్రేమ పేరుతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు తమ వద్ద లేకున్నా ధైర్యం కోల్పోని ఆ బాలిక సదరు యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యువకుడి బెదిరింపులు.. భయంతో బాలిక బలవన్మరణం - minor girl committed suicide in narayanapet
"బిడ్డా పైసలు కావాలంటే నేను పట్నం పోక తప్పదు.. నిన్ను తమ్ముళ్లను కూడా తీసుకువెళ్తే ఖర్చు ఎక్కువ. ఊళ్లోనే ఉండి నువ్వు తమ్ముళ్లను చూసుకుంటావా బిడ్డా" అని అడిగిన ఆ తల్లిదండ్రులకు పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని ఆ బాలిక.. నువ్వు ధైర్యంగా ఉండయ్యా.. నేను తమ్ముళ్లను కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పింది. చిన్న వయస్సులోనే పెద్ద భారం తలపై ఎత్తుకున్న ఆ చిన్నారి ధైర్యానికి ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధింపులు పరీక్ష పెట్టాయి. జీవితం పెట్టిన ఈ పరీక్షలో పోరాడలేక ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది.
![యువకుడి బెదిరింపులు.. భయంతో బాలిక బలవన్మరణం minor girl committed suicide due to harassment in narayanapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8747386-4-8747386-1599719160199.jpg)
గ్రామానికి వచ్చిన పోలీసులు.. మరోమారు ఆ యువకుడు బాలికను వేధించకుండా చూసుకుంటామని గ్రామపెద్దలు ఇచ్చిన హామీ తిరిగి వెళ్లారు. బుధవారం ఉదయం ఇంటి ముందు పరిసరాలు శుభ్రం చేస్తున్న బాలిక వద్దకు వచ్చిన ఆ యువకుడు.. తనను పెళ్లి చేసుకోకపోతే.. సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు.
యువకుని మాటలకు హడలిపోయిన బాలిక ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన బాలిక తమ్ముళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు వేధింపులే కారణమని తెలిపారు.