కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డును, పట్టణంలో సైన్స్ పార్కు, చిన్నపిల్లల పార్కును ప్రారంభించటంతోపాటు చేనేత పార్కు, వెజ్-నాన్‌వెజ్ మార్కెట్, మెమోరియల్ పార్కు, అంబేడ్కర్‌కూడలి సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. నారాయణపేటకు 10 కి.మీ. దూరంలోనే కర్ణాటక ఉందని, ఆ రాష్ట్రంలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా? అని ప్రశ్నించారు. రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కర్ణాటకలో ఉన్నాయో లేవో చెప్పాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తాం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట జిల్లాకు కచ్చితంగా నీరందిస్తామని, నారాయణపేట జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరందించే ప్రాజెక్ట్‌పై త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరగనుందని.. అందుకు ప్రజలు మద్దతు పలకాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. ఇటివలే ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కుటుంబాలకు 5లక్షల బీమాను సైతం ప్రకటించారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని... అందులో భాగంగా నారాయణపేట జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అందుకు కావాల్సిన 250 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.
50 వేల ఉద్యోగాల భార్తీ
నారాయణపేట జిల్లాకు అవసరమైన కలెక్టరేట్, ఇతర అధికారిక భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 50వేల ఉద్యోగాలను భర్తి చేసేందుకు నోటిపికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. 3,400 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది తెరాస ప్రభుత్వమేనని తెలిపారు.నారాయణపేటలో పట్టణ ప్రగతి పనులు వేగంగా జరుగుతున్నాయని, నారాయణపేటలోనే 2100 విద్యుత్ స్తంభాలు, 19 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు.
ఇదీ చదవండి:కీలక నిర్ణయం: నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తి నిలిపివేత