నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలానికి చెందిన చిన్న జనార్దన్‌కు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి పేరున ఉన్న భూమిని భాగ పంపిణీ ద్వారా ముగ్గురికి పంచాల్సిన అధికారులు ఆయనను వదిలి ఇద్దరి పేరున పట్టా రాసి ఇచ్చారు. ‘తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. పైగా ఈ సమస్యను పరిష్కరించడానికి తమకు అధికారం లేదని చెబుతుండటం ఆవేదనకు గురిచేస్తోంది. ఆన్‌లైన్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్‌కు సందేశం పంపి ఊరుకున్నారు’అని జనార్దన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల్లో వేలాది మంది భూ సమస్యలు పరిష్కరించాలంటూ కాగితాలు చేతపట్టుకుని తహసీల్దారు కార్యాలయం గద్దెలపై నిత్యం సాగిలపడుతున్నారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక తహసీల్దారు కార్యాలయాల్లో తగాదాలు పరిష్కారం కావని, పాసుపుస్తకాలు కూడా ఇవ్వరనే విషయంపై పేద రైతులకు అవగాహన లేదు. 2017 సెప్టెంబరుకు ముందు వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూముల సమాచారం ఆ తర్వాత కనిపించకపోవడం వెనుక కారణాలు ఏమిటో.. ఎవరు సరిదిద్దుతారో వారికి అర్థం కావడంలేదు.
ఎల్‌ఆర్‌యూపీ సందర్భంగా కొందరు సిబ్బంది ఇష్టారీతిన దస్త్రాలను మార్చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోలేదు. గ్రామ సభలు నిర్వహించి భూసమస్యలపై రైతుల అంగీకారం తీసుకోవాలంటూ ప్రభుత్వం సూచించినా ఎక్కడా అమలు చేయలేదు. దీంతో సమస్యలు కొనసాగుతూనే వస్తున్నాయి. 2020 నవంబరు ముందు వరకు ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా ఇప్పుడేమో తమ కార్యాలయాలకు రావద్దని తహసీల్దార్లు సూచిస్తుండటంతో బాధితులకు ఏమీ పాలుపోవడంలేదు. ఇటీవల మీసేవలో, ధరణిలో కలెక్టర్ల లాగిన్ ఏర్పాటు చేసి సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ వాటి పరిష్కారానికి సరైన మార్గదర్శకాలు లేవని అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు లేని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. తాజాగా లాగిన్‌నూ ఎత్తివేశారు. దరఖాస్తులు స్వీకరించినా పురోగతి కూడా ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు.
ప్రభుత్వం దృష్టి సారించాలి
రెవెన్యూ అధికారులు, సిబ్బంది విధుల్లో భాగంగా చేయాల్సినవి చేయకపోయిన అంశాలను.. లేదా వారి తప్పిదాలతో ఏర్పడిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం శాశ్వత పరిష్కార మార్గం చూపాలని బాధితులు కోరుతున్నారు. ఇలాంటి సమస్యలపై కోర్టులకు వెళ్లాలంటూ కొందరు సిబ్బంది చెబుతున్నారని నిరుపేదలకు న్యాయస్థానాలకు వెళ్లి పోరాటం చేసే స్థోమత ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.