నారాయణపేట జిల్లాలో పత్తిని అమ్మడం అంత ఈజీ కాదు. పంటను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈసారి పత్తి ఎక్కువగా సాగు చేశారు. అధికారులు మాత్రం ఉట్కూరు మండలం తిప్పరాసుపల్లిలో మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సుమారు 10 మండలాల నుంచి రోజుకు వంద నుంచి 150 వాహనాల వరకూ పంటను తెస్తున్నారు. సీసీఐ మాత్రం రోజు 60 నుంచి 70 వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తోంది.
ట్రాక్టర్లు రోడ్డుపై వరుస..
ఈ కేంద్రంలో కొనుగోళ్లు వేగంగా జరగవు. తూకం, నిల్వ అక్కడే కావడం వల్ల పత్తిని తరలించే వరకూ.. కొనుగోలు జరపడంలేదు. తూకం వేసే యంత్రం ఒకటే అందుబాటులో ఉంది. ఫలితంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాక్టర్లు రోడ్డుపై వరుస కడుతున్నాయి. పత్తిని అమ్ముకోవాలంటే రెండు, మూడు రోజులు కొనుగోలు కేంద్రంలోనే వేచిచూడాలి. మధ్యలో సెలవులు వస్తే అంతే సంగతి. రోజుకు రూ.1500 నుంచి రూ. 2వేల వరకూ ట్రాక్టర్ కిరాయి అవుతుండటం వల్ల వచ్చే లాభాలు ఖర్చులకే సరిపోతున్నాయి.