బడికి వెళ్లేందుకు చిన్నపిల్లలు మారాం చేస్తుంటారు. వారిని తల్లిదండ్రులు బుజ్జగించి, ఒక్కోసారి దండించి పంపుతుంటారు. భయంతో.. ఇష్టం లేకున్నా తరగతి గదిలో అడుగు పెట్టిన పిల్లలు అక్షరాలపై మాత్రం దృష్టి సారించరు. తనువు తరగతి గదిలో మనసు బయట అన్నట్లు వారి పరిస్థితి ఉంటుంది. ఆశించిన స్థాయిలో పిల్లలు చదువుకోవడం లేదు.
వారి వ్యక్తిత్వ నిర్మాణానికి విలువలున్న బోధన అందించాలని ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో పాఠశాలల్లో విద్యాశాఖ హరివిల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిపై ఈనెల 6వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రీసోర్సుపన్లకు ఇంతకుముందే రాష్ట్రస్థాయిలో పూర్తయింది.
హాజరుశాతం పెంచేందుకు..
పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని నూతన కార్యక్రమం చేపట్టనున్నారు. తరగతి గదిలో అభ్యసన ఆనందకరంగా ఉంటే విద్యార్థుల జీవితాలు హరివిల్లుగా మారే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులకు ప్రస్తుతం శిక్షణను పూర్తి చేసి నూతన విద్యాసంవత్సరంలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. బడుల్లో హాజరు శాతం, ప్రవేశాలు పడిపోకుండా కేంద్ర ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు హరివిల్లు- జాయ్పుల్ లర్నింగ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ తీసుకొచ్చింది.
పాఠశాలల్లో విద్యార్థులను 1, 2 సెక్షన్లుగా విభజించి మొదటి దాంట్లో 1, 2, రెండో సెక్షన్‌లో 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు బోధన అందించనున్నారు. ప్రతి సోమవారం మానసిక సంసిద్ధత, మంగళ, బుధవారం కథలు చెప్పడం, గురు, శుక్రవారాల్లో 1, 2వ తరగతులకు సమన్వయ కృత్యాలు, 3, 5వ తరగతి పిల్లలకు భావవ్యక్తీకరణ అంశాలపై బోధించనున్నారు. తొలి అరగంట హరివిల్లు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానంపై అవగాహన కల్పించనున్నారు.