తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుకాసురులు.. అక్రమార్కులకు కాసులే కాసులు!

ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అనుమతుల పేరిట ఇసుక దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుకను తరలించి కాసుల జల్లెడ పడుతున్నారు. నారాయణపేట జిల్లా పెద్దవాగు కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. జిల్లాలో నిత్యం ఏదో మూల ఇసుక వాహనాలు పట్టుబడుతున్నా... అక్రమార్కులు పంథా మార్చుకోవడం లేదు. ఈ వ్యవహారంలో అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పెద్దవాగు కేంద్రంగా యథేచ్ఛగా ఇసుకాసురుల దందా
పెద్దవాగు కేంద్రంగా యథేచ్ఛగా ఇసుకాసురుల దందా

By

Published : Feb 2, 2021, 12:54 PM IST

Updated : Feb 2, 2021, 3:58 PM IST

ఇసుకాసురులు.. అక్రమార్కులకు కాసులే కాసులు!

నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఏదో చోట అక్రమంగా తరలుతున్న ఇసుకను టాస్క్​ఫోర్స్ దాడుల్లో పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. అక్రమంగా సాగే ఇసుక దందా ఒక ఎత్తైతే... అనుమతుల పేరిట జరిగే ఇసుక దందా మరో ఎత్తు. ఉమ్మడి జిల్లాలో టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో మాగనూరు మండలం అడవి సత్యవార్​లో మాత్రమే అధికారికంగా ఇసుక రీచ్ నడుస్తోంది.

లొసుగులే ఆసరాగా...

ఫిబ్రవరి 7 వరకు 27 గుంటల స్థలం నుంచి 5,800 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీసేందుకు టీఎస్ఎండీసీ అనుమతులిచ్చింది. ఈ ఇసుక రీచ్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖలు కోరిన మేరకు ఇసుకను లారీల్లో నింపి పంపుతున్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ అంతా అధికారికమే. కానీ నిబంధనల్లోని లొసుగుల్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

పర్యవేక్షణేది?

రీచ్​లో ఇసుక నింపుకున్న ప్రతి వాహనానికి వే బిల్లు తప్పనిసరి. ఒక వే బిల్లుపై ఒక వాహనంలో ఒక లోడు మాత్రమే లక్షిత ప్రదేశానికి చేరాల్సి ఉంటుంది. ఆ వే బిల్లునే పావుగా మలుచుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే వే బిల్లుపై ఒకసారి కాకుండా ఎక్కువ సార్లు, నిర్ణీత పరిమాణంలో కాకుండా అధికంగా వాహనాల్ని నింపి కోరుకున్న ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

రీచ్ నుంచి బయలుదేరిన వాహనం లక్షిత ప్రదేశానికే చేరుతుందా అన్నదానిపై అధికారుల పర్యవేక్షణే కరవైంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే ఇసుక తవ్వకాలు జరగాల్సి ఉండగా.. రాత్రివేళల్లోనూ ఇసుక రవాణా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వే బిల్లు చూపి...

రీచ్​లో ఇసుక నింపుకుని బయలు దేరిన వాహనం.. నిర్ణీత సమయంలో లక్షిత ప్రదేశానికి చేరాల్సి ఉంటుంది. కానీ లక్షిత ప్రదేశాలకు కాకుండా కోరుకున్న ప్రదేశాలకు ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు లేదా పోలీసులు ఆపితే వే బిల్లు చూపించి తప్పించుకుంటారు. కానీ వే బిల్లులో చూపిన గమ్యస్థానం కాకుండా ఇసుకను అక్రమంగా వేరే చోట్లకు అమ్మేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై నిఘా పెట్టాల్సిన అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

నిరాకరణ...

టీఎస్ఎండీసీ అధికారులు మాత్రం అడవి సత్యవార్ ఇసుక రీచ్ విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని చెబుతున్నారు. రీచ్ నుంచి వెళ్లే ప్రతి వాహనానికి వే బిల్లు ఇస్తామని.. రీచ్ పరిధి నుంచి వాహనం వెళ్లిపోయాక.. ఎక్కడ డంప్ చేయాలన్నది తమ బాధ్యత కాదని టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఒప్పందంలో ఉన్న విస్తీర్ణంలోనే నిర్ణీత పరిమాణం, లోతులో ఇసుక తీస్తామని వివరించారు. రాత్రివేళల్లో తవ్వకాలు జరగడం లేదని స్పష్టం చేశారు.

ఇసుక అక్రమ దందా విషయంలో మండల రెవిన్యూ అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా మాట్లాడేందుకు నిరాకరించారు. మాట్లాడకూడదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని చెప్పారు.

Last Updated : Feb 2, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details