పెళ్లంటే జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. మధురమైన ఘట్టం. అందుకే వివాహా వేడుకల్ని కుల, మత, ధనిక, పేద తారతమ్యం లేకుండా ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు. ఇంటి ముందు పందిళ్లు, ఇల్లంతా చుట్టాలు, బాజాలు, భజంత్రీలు, విందులు, వినోదాలు ఇలా వివాహ క్రతువులో ఎన్నో ఘట్టాలు.
ప్రస్తుతం వివాహలపై కరోనా ప్రభావం పడింది. ఈ నెల 14 వరకే లాక్ డౌన్ కొనసాగుతుందని భావించి.. ఏప్రిల్ 16న పెళ్లికి ముహుర్తాలు పెట్టుకున్నాయి ఆ కుటుంబాలు. లాక్డౌన్ను పొడిగించడం వల్ల చేసేది లేక.. పెట్టుకున్న ముహుర్తానికే నిరాడంబరంగా వివాహాలు జరిపించాయి. నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలో నాలుగు జంటలు పెళ్లి చేసుకుని ఏకమయ్యాయి. వరుల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరగ్గా.. వధువుల్లో ఒకరిది కర్ణాటక రాష్ట్రం మద్వార్ కాగా మరొకరిది పస్పుల. ఇంకొకరిది ఉట్కూరు మండల కేంద్రం కాగా.. మరొకరిది ఊట్కూరు మండలం పగిడిమర్రి.