తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యం కోసం ఇబ్బందులు... భయాందోళనలో స్థానికులు - A dilapidated building maganoor primary health centre

ఆ ప్రభుత్వాసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. ఆస్పత్రి ఆవరణ మొత్తం మురికి కూపంగా మారింది. మరోవైపు శిథిలావస్థకు చేరిన భవనం పై పెచ్చులు ఊడిపడిన ఘటనలు సంభవించాయి. 25 ఏళ్లుగా అదే భవనంలో సేవలు అందిస్తుండగా రోగులు భయాందోళన చెందుతున్నారు. నూతన భవనం నిర్మాణం ప్రారంభించి ఏడాదిన్నర అయినా అందుబాటులోకి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Difficulties for treatment healing at maganoor primary health centre
వైద్యం కోసం ఇబ్బందులు... భయాందోళనలో స్థానికులు

By

Published : Jul 29, 2020, 5:15 PM IST

వైద్యం కోసం ఇబ్బందులు... భయాందోళనలో స్థానికులు

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరింది. మాగనూరు, కృష్ణ మండలాలకు ఒకే ప్రభుత్వాసుపత్రి కావడం వల్ల రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రోజుకు సుమారు 50 మంది రోగులు ఆస్పత్రిని ఆశ్రయిస్తుంటారు. నెలకు 20-25 సాధారణ కాన్పులు అవుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఆస్పత్రి చుట్టూ అపరిశుభ్రత అలుముకుంది. ఆస్పత్రిలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, రోగులు ఉక్కపొతతో విలవిలలాడుతున్నారు. రోగులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకే ఆస్పత్రి తప్ప అక్కడ ఎలాంటి వసతులు లేవని స్థానికులు వాపోతున్నారు.

మరమ్మత్తులకు నోచుకోలేదు...

శిథిలమైన భవనం, అపరిశుభ్రత వాతావరణం, తాగునీటి సమస్య, మరమ్మతులకు నోచుకోని విద్యుత్ బోర్డులు, వెలగని దీపాలు, ఆస్పత్రి ఆవరణలో పేరుకు పోయిన చెత్తతో సమస్యల వలయంగా మారింది. ఆ భవనంలో రోగులపై పెచ్చులూడి తృటిలో తప్పిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రహరీ లేకపోవడం వల్ల పందులు, పాములు ఆవరణలోకి వచ్చిన ఘటనలు సైతం ఉన్నాయని చెబుతున్నారు.

పిల్లర్లకే పరిమితం

ఉమ్మడి మాగనూరు మండలంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం ప్రారంభించి ఏడాదిన్నర అయినా పనులు కేవలం పిల్లర్లకే పరిమితమయ్యాయి. మండల కేంద్రంలోని పాత ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడం వల్ల ప్రభుత్వం మాగనూర్, కృష్ణ మండలాలకు ప్రభుత్వం ఆస్పత్రి భవనాన్ని నిర్మించేందుకు నిధులను కేటాయించింది. ప్రభుత్వం ఒక కోటి 5 లక్షల రూపాయలతో ఆస్పత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆ ఆస్పత్రి భవనం ఆరు పడకల గది నిర్మించే విధంగా గుత్తేదారు పనులను గత ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించారు. కాలపరిమితి పూర్తికావస్తున్నా భవనం పిల్లర్లకే పరిమితం కావడం వల్ల ప్రజలు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి :'నీ పేరు లక్ష్మీనరసింహస్వామి... నా పేరు శారదాదేవి'.. కాళేశ్వరం ప్యాకేజీలు

ABOUT THE AUTHOR

...view details