తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి పోర్టల్‌ నిషేధిత జాబితాలో ఊళ్లో మొత్తం సర్వేనెంబర్లు - dharani portal problems

భూతగాదాలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకువచ్చిన 'ధరణి' పోర్టల్‌ పలుచోట్ల సమస్యలకు కేంద్రంగా మారుతోంది. భూముల క్రయవిక్రయాలకు రెవెన్యూ కార్యాలయానికి వెళ్తున్న రైతులు... నెలల తరబడిగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు... ఏకంగా ఊరుఊరందరికీ రిజిస్ట్రేషన్లు కా­కపోవటం.... ఆ గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తోంది. తహశీల్దార్ నుంచి సీఎస్​ వరకూ విన్నవించినా.. సమస్య పరిష్కారం కావటం లేదు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ఓ గ్రామస్థుల ధరణి సమస్యలపై ప్రత్యేక కథనం.

Dharani Portal problems, Narayanpet district news
ధరణి పోర్టల్‌ నిషేధిత జాబితాలో ఊళ్లో మొత్తం సర్వేనెంబర్లు

By

Published : Apr 14, 2021, 5:05 AM IST

ధరణి పోర్టల్‌ నిషేధిత జాబితాలో ఊళ్లో మొత్తం సర్వేనెంబర్లు

బిడ్డ పెళ్లి కోసమని భూమి అమ్మితే... ఆర్నెళ్లైనా చేతికి డబ్బు అందలేదు. పిల్లలకు భూమి పంచేందుకు ఓ తల్లి మూడు నెలలుగా తిరుగుతున్నా స్పందించేవారు లేరు. ఇళ్లు కట్టుకునేందుకు స్థలం కొన్నా... ఆర్నెళ్లైనా రిజిస్ట్రేషన్‌ కాక... ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు...నెలలు గడుస్తున్నా... భూముల రిజిస్ట్రేషన్లలో ముందడుగు పడటం లేదు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి ధరణి పోర్టల్‌ పాలిట శాపంగా మారింది. పోర్టల్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గ్రామంలో వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్లే కావడం లేదు. అసలు స్లాటే నమోదు కావడం లేదు. దీంతో క్రయవిక్రయాలు జరిపిన రైతులు... నెలల తరబడిగా నానా ఇబ్బందులకు గురువుతున్నారు. ఒప్పందం మేరకు రిజిస్ట్రేషన్లు జరగక... ఆర్థికంగా నష్టపోతున్నారు.

నిషేదిత భూముల జాబితా

చంద్రవంచ గ్రామ జనాభా 14 వందల వరకు ఉంటుంది. గ్రామంలో సుమారు 615 పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. 1,570 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. 260 వరకు సర్వే నెంబర్లున్నాయి. సాధారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములు, సీలింగ్ భూములు, భూదాన్ భూములు... ఇలాంటివి మాత్రమే ధరణి పోర్టల్ సహా రిజిస్ట్రేషన్ శాఖ దస్త్రాల్లో నిషేదిత భూముల జాబితాలో చేర్చుతారు.

వినతులు వెళ్లినా..

కానీ... చంద్రవంచ గ్రామంలో ఒకటో సర్వే నెంబర్ మొదలు కుని 262వరకూ అన్ని భూముల్ని నిషేదిత జాబితాలో చేర్చారు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక తహసీల్దార్ సహా జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వరకూ వినతులు వెళ్లినా.... సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సాంకేతిక సమస్యలు, అధికారుల తప్పిదం కారణంగా... ప్రస్తుతం ఊరుకు ఊరే ఇబ్బందుల పాలవుతోంది. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఆ గ్రామంలో భూముల క్రయవిక్రయాలకు ఎవరూ ముందుకు రావడం లేదు.

సాంకేతిక కారణాల వల్లే చంద్రవంచ గ్రామంలోని భూములు... నిషేదిత భూముల జాబితాలోకి వెళ్లాయంటున్న అధికార యంత్రాంగం... ఆ లోపాల్ని మాత్రం సవరించలేకపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి... ఊరి సమస్య తీర్చాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి :తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details