Deers Destroying Crops In Narayanpet District : సాధారణంగా విత్తనాలు మొలకెత్తితే రైతులు ఎంతో సంతోషిస్తారు. కానీ నారాయయణపేట జిల్లాల్లోని ఊట్కూరు, మక్తల్, మానగూరు సమీప మండలాల్లోని కర్షకులు మాత్రం బెంబేలెత్తిపోతారు. కారణం కాస్త వానలు పడితే చాలు అటవీ ప్రాంతం నుంచి బయటికొచ్చి జింకలు పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కసారి పొలం నుంచి జింకల గుంపు వెళ్లిందంటే చాలు పంటపైన ఆశలు వదులుకోవాల్సిందే. మొలకెత్తిన విత్తనాలు ఆకులు చిగురిస్తే అక్కడే మేసేస్తాయి. సాగు కోసం చేసిన దున్నకాలు, కూలీ, విత్తనాలు, ఎరువుల ఖర్చులు ఆవిరైపోతాయి. పత్తి, కంది, ఆముదం, కూరగాయలు సహా ఏ పంటైనా జింకలకు బలి కావాల్సిందే. ఒకసారి దాడి చేస్తే ఎకరానికి రూ.20,000 నష్టపోవాల్సిందేననిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలాలపై దాడులు చేసే జింకలను అక్కడి రైతులు నియంత్రించలేకపోతున్నారు. రేయింబవళ్లూ పంటలకు కాపలా కాస్తున్నా ఎటు నుంచి వస్తాయో తెలియక సతమతమవుతున్నారు. ఎప్పుడు వస్తాయో అంతు చిక్కదు. వందల కొద్దీ వచ్చిన జింకలను ఓ వైపు వెళ్లగొట్టినా మరోవైపు నష్టం చేస్తాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు నష్టపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ పంటలు వేసుకోవాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
- పొలానికి సెలైన్ బాటిల్ పెట్టిన రైతన్న అందుకోసమేనటా
- మిర్చిలో నల్లతామరకు సోలార్ లైట్‌తో చెక్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి..!
Deer Attack On Crops :జింకల సమస్యలను పరిష్కరించాలని నాలుగైదు ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, అటవీశాఖ అధికారులకు ఎన్నో విజ్ఞప్తులు చేశామని రైతులు పేర్కొన్నారు. జరిగే నష్టాన్ని భరించలేక మంగళవారం ఉట్కూరు చౌరస్తా వద్ద ధర్నాకు సైతం దిగారు. అయినా అధికారులు సర్ది చెప్తున్నారే తప్పా చర్యలు తీసుకోవట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇలాగైతే తమ సాగు సాగెదేలా అని గోడు వెలిబుచ్చుతున్నారు.