నారాయణపేట జిల్లాలో తక్కువ ధరకే మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మక్తల్, ఊట్కూరు, మాగనూరు సహా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తక్కువ సమయంలోనే, తక్కువ స్థలంలో పెద్దగా ఖర్చేమీ లేకుండానే నిర్మించుకోవడం ఈ మరుగుదొడ్ల ప్రత్యేకత. వీటి నిర్మాణానికి వినియోగించే కాంక్రీటు రింగులు, లావెట్రీ బేషన్, కుళాయి, పైప్ లైన్ అంతా రెడీమేడ్ సామాగ్రే. కేవలం రెండు, మూడు రోజుల వ్యవధిలోనే వీటిని నిర్మించవచ్చు. మొత్తంగా రూ. 10 వేల ఖర్చులోపే మురుగుదొడ్లు సిద్ధం చేసుకోవచ్చు.
మరుగుదొడ్లకు కొత్త హంగులు
ప్రభుత్వ కార్యాలయాల్లో నూతనంగా నిర్మించే మరుగుదొడ్లకు అదనపు హంగులు అద్దుతున్నారు. రకరకాల రంగులు, డిజైన్లు, బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఖర్చులు మాత్రం రూ.10 వేలకు అదనం.
జిల్లాలో ప్రయోగాత్మకంగా..
హైదరాబాద్లో ఆర్నెళ్ల కిందట ఇంక్ వాష్ పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ అనే వ్యక్తి ఈ చవకైన మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కార్యశాలకు హాజరైన కలెక్టర్ హరిచందన నారాయణపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలుచోట్ల 15 మరుగుదొడ్లు నిర్మించారు. నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో అధిక రద్దీ ప్రాంతాలు, మురికి వాడల్లో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ మరుగుదొడ్డి నిర్మించుకొని వారికి, నిరుపేదలకు ఈ నమూనాను ప్రతిపాదించనున్నారు.