ప్రభుత్వ ఆదేశాలతో మద్దతు ధరతో... నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని నారాయణపేట కలెక్టర్ హరిచందన తెలిపారు. రైతులందరూ గమనించి సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లేదా ఆ ఏజెన్సీలను సంప్రదించి పంట పొలాల వద్దనే నేరుగా అమ్ముకోవాలని సూచించారు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా తమ దగ్గరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంప్రదించవచ్చన్నారు. వానాకాలం 2020-21 సంవత్సరానికి 56 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నవంబరు 1 నుంచి సేకరిస్తామని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెల్లడించారు.
రైతుల నుంచి మాత్రమే...
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జాగ్రత్తగా మిల్లులకు చేరవేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతుల నుంచి మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, దళారీలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయిన ధాన్యాన్ని తీసుకోకూడదని సూచించారు. మిల్లుల నిర్వాహకులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన బస్తాలు ధృవీకరించాలని... వాటిని తమ మిల్లులో మాత్రమే దించుకోవాలని, వేరే ప్రదేశాలలో దించుకుంటే సంబంధిత మిల్లులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.