పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ - ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్య CM KCR Election Campaign in Mahabubnagar District : పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను అటకెక్కించినా.. కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. గులాబీ జెండా ఎగిరిన తర్వాత పాలమూరు పచ్చబడుతుంటే.. మళ్లీ పెత్తనం కోసం వస్తున్నారని, పార్టీలు, అభ్యర్థుల చరిత్ర చూసుకుని ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.
గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా : కేసీఆర్
BRS Praja Ashirwada Sabha : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట సభల్లో మాట్లాడిన ఆయన.. ప్రధానంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పార్టీలు, అభ్యర్థుల చరిత్ర తెలుసుకుని పరిణితితో ఓట్లు వేస్తే.. ప్రజలు గెలుస్తారని తెలిపారు. గత పాలకులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టారని.. ప్రాజెక్టులను రద్దు చేశారన్నారు. పాలమూరుకు అన్యాయం జరుగుతుంటే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు మెదపలేదని విమర్శించారు.
'ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది - సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుంది'
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని.. అదే జరిగితే మరోసారి దళారుల రాజ్యం వస్తుందని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే పెరుగుతున్న రాష్ట్ర ఆదాయానికి అనుగుణంగా.. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు పంచుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. పాలమూరులో వలసల నివారణకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే మోసపోతాం. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ అన్నారు. రైతుల కోసమే ధరణి తీసుకొచ్చాం. ప్రభుత్వ అధికారాన్ని తీసుకొచ్చి రైతుల చేతుల్లో పెట్టాం. మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమిని మార్చే శక్తి సీఎంకు కూడా లేదు. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీ రాజ్యం వస్తుంది. రైతులు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదు. కేసీఆర్ అనవసరంగా కరెంట్ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి అంటున్నారు. కరెంట్ 24 గంటలు ఉండాలంటే.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. - కేసీఆర్, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత
సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య - తప్పిన ప్రమాదం
పాలమూరు పర్యటనకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తుండగా.. సాంకేతిక సమస్య రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు. దీంతో ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. మరో హెలికాప్టర్ రాగానే కేసీఆర్ పర్యటన యధావిధిగా కొనసాగింది.
దీపావళి తర్వాత సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఈసారి ఏకంగా రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలు